ఇదెక్కడి విడ్డూరం: ఆవు గుద్ది చనిపోయినా మనిషిదే తప్పంట

పశువులకు ఇచ్చినంత విలువ మనుషులు దక్కడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన కనిపిస్తున్న ఈ తంతు రాన్రాను లీగల్ అయిపోతదేమో. లేదా వాటికి ఎదురుచెప్పిన వాడి పరిస్థితి ఏ దిక్కూ లేకుండా మిగిలిపోతుందేమో. గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన అలాగే అనిపిస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని అడ్డొచ్చిన ఆవులను వదిలేసి కచ్చితంగా వేగంగా వస్తున్న వ్యక్తిదే తప్పు అంటూ కేసు కూడా నమోదు చేయలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి లాభం లేక కొడుకు మరణానికి ఏమీ చేయలేని ఆ తండ్రి నిస్సహాయతతో కుమిలిపోతున్నాడు.
అహ్మదాబాద్‌కు దగ్గర్లోని కాజోల్ ప్రాంతంలో కార్ డీలర్ వద్ద పనిచేస్తున్న సంజయ్ పటేల్(28) వివాహమై ఏడాదిన్నర దాటింది. పనులు ముగించుకుని అహ్మదాబాద్ హైవేపై మోటార్ సైకిల్ పై వస్తున్నాడు. అకస్మాత్తుగా అప్పుడే రెండు ఆవులు రోడ్డు మీదకు వచ్చేశాయి. హఠాత్ పరిణామానికి తేరుకునే లోపే ఆవులు గుద్దడం రోడ్డు మీద పడిపోవడంతో బ్రెయిన్‌కు దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
కొడుకు మృతితో తండ్రి తీవ్రమైన మనోవేధనకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని పశువుల యజమానిపై చర్యలు తీసుకోవాలని 14ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. కానీ, ఒక్కరు కూడా కేసు నమోదు చేయలేదు. పైగా రాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడని తిట్టిపోశారు.
గుజరాత్ హైకోర్టు, అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్, సిటీ పోలీసు కమిషనర్‌లు సైతం ఇటువంటి ఘటనలలో వాహన యజమానిదే తప్పంటూ తప్పించుకుంటున్నారు. ఏడు నెలలుగా చనిపోయిన కొడుకుకు న్యాయం చేయలేని ఆ తండ్రి ఆవేదనను విన్న జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ‘మరొకసారి ఈ విషయాన్ని పరిశీలిస్తాం. తగిన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు’ అని సంజయ్ తండ్రి తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులేమో రాష్ డ్రైవింగ్ అంటూ కేసు కూడా నమోదు చేసుకోలేదు.