ఆ ఊరిలో మగవాడిగా….. ఈ ఊరిలో మహిళగా …

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఉన్నఊళ్లో ఉద్యోగం దొరక్క పోవటంతో మహిళ అవతారం ఎత్తి పక్క ఊరులో పాచి పని చేసుకుని వృధ్ధ దంపతులను పోషిస్తున్నాడో వ్యక్తి.తమిళనాడులోని మధురై లో ఓ వ్యక్తి గత ఆరునెలలుగా ఆడవేషం ధరించి ఇళ్ళల్లో పాచి పనులు చేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.
శివగంగై జిల్లా మానామదురైకి చెందిన రాజా అనే వ్యక్తికి(40) ఆ ఊరిలో ఏ ఉద్యోగం లభించలేదు. ఏం చేయాలో తోచని రాజా మదురై వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అక్కడ అతనికి సరైన అవకాశం లభించలేదు. చివరికి ఇళ్లల్లో పాచి పని చేయటం కోసం ఆడవేషం వేసుకుని ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఈ విషయం సీక్రెట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. రోజూ స్వగ్రామం నుంచి వచ్చి పని చేసుకుని వెళ్లిపోయేటట్లు ప్లాన్ చేసుకున్నాడు.
మానామదురై నుంచి ఉదయాన్నే మదురై వచ్చి..రాజర్‌రోడ్డులోని తెప్పకుళం ప్రాంతంలో ఒక మరుగైన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ లుంగీ, షర్టు విప్పేసి చీర, జాకెట్ వేసుకుని తలకు విగ్ ధరించి ఆడవేషంలో బయటికి వస్తాడు. ఆ ఏరియాలోని మూడు ఇళ్లకు వెళ్లి ఇంట్లో పాచి పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి తలపై విగ్ తీసేసి మళ్లీ పురుషుడిలా లుంగీ, షర్టుతో ఊరికి బయలుదేరి వెళ్ళటం మొదలెట్టాడు.
రాజా తాన పని చేసే ఇళ్ళల్లో తనపేరు రాజాత్తిగా చెప్పాడు. ఇంతవరకు ఎవరికీ అతను పురుషుడు అనే అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని కొందరు యువకులు పసిగట్టారు. దీంతో రాజాని పట్టుకుని నిలదీశారు. రాజా వారికి వాస్తవం వివరించి చెప్పాడు. సొంతూరులో తనకు ఎలాంటి పని దొరకలేదని, వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకునేందుకు గత్యంతరం లేక ఆడవేషం వేసినట్లు తెలిపాడు.
ఆరునెలల క్రితం పనుల కోసం మదురైకి వచ్చానని చెప్పాడు. తాను పనిచేసే చోట ఎవరూ తనను పురుషుడిగా గుర్తించకుండా జాగ్రత్తపడ్డానని..కొందరు తాను మహిళ వేషంలో మోసం చేస్తున్నట్లు భావించవచ్చని…అయితే తల్లి తండ్రులను పోషించుకోటానికి ఇంతకంటే మార్గం దొరకలేదని వివరించాడు.తాను పని చేసే చోట క్రమశిక్షణతోనే మెలుగుతున్నట్లు చెప్పాడు.
ఒకరోజు ఈ విషయం యజమానులకు తెలిసినా వారు తన పరిస్ధితి గమనించి తిరిగి పనిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నానని అన్నాడు. రాజా దుస్తులు మార్చుకుని స్త్రీ వేషం వేసుకుని పనికి వెళ్లే ఫోటోలు, వీడియోలు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.