బరితెగించిన మైనింగ్ మాఫియా : కలెక్టర్‌పై హత్యాయత్నం

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 07:03 AM IST
బరితెగించిన మైనింగ్ మాఫియా : కలెక్టర్‌పై హత్యాయత్నం

Updated On : April 14, 2019 / 7:03 AM IST

ఛత్తీస్‌గఢ్ : మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్)ని చంపాలని చూసింది. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ అధికారిపై మర్డర్ అటెంప్ట్ చేశారు. జేసీబీతో తొక్కించి  చంపాలని చూశారు. శుక్రవారం(ఏప్రిల్ 19, 2019) అర్థరాత్రి సారన్ గర్ లోని మైనింగ్ బెల్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాయ్ గర్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్, డొలమైట్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయి.  దీనిపై అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ చతుర్వేదికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఇల్లీగల్ మైనింగ్ పై విచారణకు ఆదేశించారు.

అదే సమయంలో మైనింగ్ మాఫియా లీడర్ అమ్రిత్ పటేల్ తన అనుచరులతో అక్కడికి వచ్చాడు. అసిస్టెంట్ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. విచారణకు ఆదేశిస్తావా అని మండిపడ్డాడు. అంతేకాదు తన అనుచరుడికి  సైగ్ చేసి జేసీబీతో చతుర్వేది కారుని తొక్కించి చంపేయాలని ఆదేశించాడు. అమ్రిత్ పటేల్ చెప్పినట్టు ఆ డ్రైవర్ జేసీబీతో కలెక్టర్ కారుపైకి దూసుకొచ్చాడు. ప్రమాదాన్ని పసిగట్టిన కలెక్టర్ అప్రమత్తం అయ్యారు. తెలివిగా  కారు దిగి పక్కకు వెళ్లిపోయారు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. పటేల్ మాత్రం కలెక్టర్ ని వదల్లేదు. కలెక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కలెక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. 10 ట్రక్కులు, 2 జేసీబీలు, 4 మోటార్ సైకిళ్లు, 300 టన్నుల గ్రానైట్, పేలుడు పదార్దాలు సీజ్ చేశారు. మర్డర్ అటెంప్ట్ చేసిన పటేల్ పై ఐపీసీ సెక్షన్లు 307, 506  కింద కేసులు బుక్ చేశారు. పరారీలో ఉన్న పటేల్, అతడి అనుచరుల కోసం గాలిస్తున్నారు.