దేశం ఆశ్చర్యపోతోంది.. పాకిస్థాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చింది: లోక్‌సభలో మోదీ

"అప్పట్లో భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్‌ అభినందన్‌ పాకిస్థాన్‌ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు" అని అన్నారు.

దేశం ఆశ్చర్యపోతోంది.. పాకిస్థాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చింది: లోక్‌సభలో మోదీ

Updated On : July 29, 2025 / 8:19 PM IST

సాయుధ బలగాలపై వ్యతిరేకత, నెగిటివిటీని ప్రదర్శించడమనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న వైఖరేనని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు.

“పాకిస్థాన్ చేసిన అన్ని ప్రకటనలను, మనపై ఇప్పుడు ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు చేసిన ప్రకటనలను చూడండి. ఫుల్‌స్టాప్‌, కామాల వరకూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. దేశం ఆశ్చర్యపోతోంది. కాంగ్రెస్ పాకిస్థాన్ కు క్లిన్ చిట్ ఇచ్చింది.

భారత్‌ చేసిన ఆపరేషన్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోంది. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. మీడియా దృష్టిని ఆకర్షించాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. పాక్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకువస్తోంది.

Also Read: ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నాయకుడూ చెప్పలేదు: లోక్‌సభలో మోదీ ప్రకటన

అప్పట్లో భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్‌ అభినందన్‌ పాకిస్థాన్‌ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వీరి తీరు చూసి భారత్‌ యావత్తూ నవ్వుకుంటోంది. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుంది. పాకిస్థాన్‌ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా అందుకు తగ్గ బదులిస్తాం” అని మోదీ అన్నారు.

పహల్గాం దాడికి సంబంధించిన ఉగ్రవాదులను కూడా హతమార్చామని, ఆపరేషన్‌ మహాదేవ్‌ చేపట్టామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తత పెరిగినప్పుడు సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ అన్నారు. నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇచ్చామని మోదీ స్పష్టం చేశారు.

పహల్గాం దాడి వెంటనే పాకిస్థాన్ తమ వద్ద అణు బాంబులు ఉన్నాయంటూ బెదిరించడానికి ప్రయత్నించిందని, కానీ తాము ముందే నిర్ణయించిన ప్రకారం ఆపరేషన్‌ చేపటామని అన్నారు. పాక్ చేయగలిగింది ఏమీ లేదని, సైనికులు 22 నిమిషాల్లో ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపారు. పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు మోదీ చెప్పారు.