సీఏఏ కి మద్దతుగా 1000 మంది మేధావుల సంతకాలు

  • Published By: chvmurthy ,Published On : December 21, 2019 / 10:23 AM IST
సీఏఏ కి మద్దతుగా 1000 మంది మేధావుల సంతకాలు

Updated On : December 21, 2019 / 10:23 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొందరు నిరసన తెలుపుతూ ఆందోళనలు చేస్తూంటే… మరోవైపు కొందరు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వపిస్తున్నారు. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు  ప్రభుత్వానికి మద్దతుగా బహిరంగ లేఖ రాశారు. ప్రముఖ విద్యావేత్తలు, సాహిత్య కారులతో దేశంలోని వివిధ యూనివర్శిటీలకు  చెందిన ఉన్నతాధికారులు, పలువురు సీనియర్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ విషయంలో ప్రజలు తప్పుడు  ప్రచారానికి పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఢిల్లీలో స్ధానికి  ప్రజలు ప్రదర్శన చేసారు. శుక్రవారం ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ లో సిటిజన్షిప్ అమెండ్ మెంట్ చట్టానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. భారీసంఖ్యలో సెంట్రల్ పార్క్ కు చేరుకున్న ప్రజలు ఫ్లకార్డులతో తమ మద్దతును తెలిపారు. దేశ పటిష్టతకు CAA చట్టం ఊతమిస్తుందని వారు నినాదాలు చేశారు. 

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మైనార్టీలుగా ఉన్నవారిని  ఆదరిస్తే ఎందుకు తప్పు పడుతున్నారని వారు ఫ్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంటును అభినందించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సమస్యలపై  కేంద్ర సరైన సమయంలో సానుకూల నిర్ణయం  తీసుకుంటుందని..అక్కడివారు ఆందోళన చెందనక్కర్లేదని వారు తెలిపారు.

గత వారం పార్లమెంటు  ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లలో నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కనీసం 14 మంది మరణించారు. ఈ అల్లర్లలో భారీగా ఆస్తినష్టం జరిగింది. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో పలు చోట్ల వాహణాలకు నిప్పంటించారు ఆందోళనకారులు. ఈ ఘటనపై… కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి  విలేకరులతో మాట్లాడుతూ…కాంగ్రెస్ కమ్యునిస్ట్ పార్టీలు దేశంలోని ముస్లింలను తప్పుదోవపట్టిస్తున్నాయని అన్నారు. 

దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో రైల్వేలకు 88కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులువెల్లడించారు. ఆందోళనకారులు పలుచోట్ల రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.  ట్రాక్ లను ధ్వంసం చేశారు. మోఘాలయ బెంగాల్, అసోంలలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొనడంతో అక్కడ ఇంటర్నెట్ సేవలను పునరుధ్దరిస్తున్నారు. 

బిల్లు ఆమోదం పొందినప్పటినుంచి ఈశాన్య రాష్ట్రమైన అసోం తో సహా దేసంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు  చెలరేగాయి. పౌరసత్వ సవరణ చట్టం అమానవీయమైందనీ, ముస్లింలపై వివక్ష చూపుతుందని, దేశ లౌకిక రాజ్యాంగాన్ని బలహీనపరుస్తుందని బిల్లును వ్యతిరేకిస్తున్నవారు తీవ్ర విమర్శలుచేస్తున్నారు. ఈ చట్టాన్ని కేంద్రం  తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

వలస వచ్చిన ముస్లింలను దేశం నుంచి తరిమేసేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  విమర్సించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఈ బిల్లును పార్లమెంటరీలో వ్యతిరేకించింది.. కానీ రాష్ట్రంలో దీనిపై నిరసనలు చేస్తే అణచివేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.