Mumbai Hostage Crisis: ముంబై పిల్లల నిర్బంధం ఘటన.. 17మంది చిన్నారులను బంధించడానికి అసలు కారణం ఏంటి? ఎవరీ రోహిత్ ఆర్య? సంచలన విషయాలు..

తమ పిల్లలు భోజనానికి తిరిగి రాకపోవడంతో అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే

Mumbai Hostage Crisis: ముంబై పిల్లల నిర్బంధం ఘటన.. 17మంది చిన్నారులను బంధించడానికి అసలు కారణం ఏంటి? ఎవరీ రోహిత్ ఆర్య? సంచలన విషయాలు..

Updated On : October 31, 2025 / 7:53 PM IST

Mumbai Hostage Crisis: గురువారం ముంబైలోని పోవైలో 38 ఏళ్ల రోహిత్ ఆర్య 17 మంది పిల్లలతో సహా 19 మందిని RA స్టూడియో లోపల బందీలుగా తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు గంటల పాటు ఉద్రిక్తతకు దారితీసింది. వెబ్ సిరీస్ ఆడిషన్స్ పేరుతో పిలిపించి పిల్లలను బందీలను చేయడం కలకలం రేపింది. బందీలలో 75ఏళ్ల వృద్ధురాలు కూడా ఉంది.

నిందితుడు రోహిత్ ఆర్యపై పోలీసు కమాండోలు కాల్పులు జరిపారు. గాయాలతో అతను మరణించాడు. అదృష్టవశాత్తూ, బందీలందరూ సురక్షితంగా బయటపడ్డారు. వైద్య పరీక్షల తర్వాత వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

మధ్యాహ్నం 1:45 గంటలకు ఒక్కసారిగా కలకలం రేగింది. తమ పిల్లలు భోజనానికి తిరిగి రాకపోవడంతో అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే పోవైలోని మహావీర్ క్లాసిక్ సమీపంలోని వీధి పోలీస్ వ్యాన్లు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లతో నిండిపోయింది.

తర్వాత 8 మంది కమాండోలతో కూడిన క్విక్ రియాక్షన్ టీం (QRT) ఆడిషన్ గదిలోకి బాత్రూమ్ ద్వారా చొరబడింది. బందీలను కాపాడేందుకు QRT కి 35 నిమిషాలు పట్టింది.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఐదు కీలక అంశాలుగా విభజించారు. అసలేం జరిగింది, దాని వెనుక ఎవరున్నారు, కమాండోలు పరిస్థితిని ఎలా అదుపులోకి తెచ్చారు.. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై హోస్టేజ్ సంక్షోభ సమయంలో ఏం జరిగింది?

పోవైలోని ఆర్ఏ స్టూడియోలో ఈ సంఘటన జరిగింది. అక్కడ 17 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలు దాదాపు నాలుగు గంటల పాటు బందీగా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం, పిల్లలను యాక్టింగ్ ఆడిషన్ కోసం ఆహ్వానించారు. లోపలికి వెళ్ళిన తర్వాత, రోహిత్ ఆర్య తలుపులు లాక్ చేసి ఎవరినీ బయటకు వెళ్ళనివ్వలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేరుకోలేకపోయారు. వారు బాగా భయపడ్డారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆర్యను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

పోలీసులు దాదాపు రెండు గంటల పాటు ఆర్యతో చర్చలు జరిపారు. పిల్లలను విడిచిపెడితే అతని డిమాండ్లను వింటామని హామీ ఇచ్చారు. కానీ అతను వారిని సజీవ దహనం చేస్తానని పదే పదే బెదిరించాడు.

ఎవరీ రోహిత్ ఆర్య?

స్వయం ప్రకటిత యాక్టింగ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందిన రోహిత్ ఆర్య.. RA స్టూడియోతో సంబంధం కలిగి ఉన్నాడు. సంఘటనకు కొన్ని రోజుల ముందు అతను యాక్టింగ్ వర్క్‌షాప్‌లు, షార్ట్-ఫిల్మ్ ఆడిషన్లు నిర్వహించాడు. ఆర్య ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని కుటుంబం పుణెలో ఉంది. అతను ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపాడు.

ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా గుర్తించబడిన ఆర్య, మహారాష్ట్ర మాజీ విద్యా మంత్రి దీపక్ కేసర్కర్ హయాంలో విద్యా శాఖకు సంబంధించిన పాఠశాల ప్రాజెక్ట్ కోసం టెండర్‌ను పొందినట్లు సమాచారం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి తనకు డబ్బు చెల్లించలేదని ఆర్య ఆరోపించాడు. కేసర్కర్ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి నివాసం వెలుపల అనేక నిరసనలు నిర్వహించాడు.

రోహిత్ ఆర్య పిల్లల్ని ఎందుకు బంధించాడు?

రోహిత్ ఆర్య వాదనల ప్రకారం.. తన విద్యా కార్యక్రమాలకు పేమెంట్ చెల్లించకపోవడం, రుణాలు ఇవ్వకపోవడంతో సంవత్సరాల తరబడి తీవ్రమైన నిరాశలో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే అతడు ఈ తీవ్రమైన చర్య తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

అతను 2023లో మహారాష్ట్రలో స్వచ్ఛతా మానిటర్ కాన్సెప్ట్ ను ప్రారంభించాడు. అయితే, రాష్ట్రం దాన్ని హైజాక్ చేసిందని, తన పాత్రను గుర్తించలేదని, పైగా బకాయిలు చెల్లించకుండా “మాఝీ శాల, ​​సుందర్ శాల”ను అమలు చేసిందని ఆరోపించాడు. రోహిత్ భార్య అంజలి ఆర్య మీడియాతో మాట్లాడారు. కేసర్కర్ ఆమోదించిన మంజూరైన పేమెంట్ పొందడంలో తన భర్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆమె తెలిపారు. పిల్లలను బందీ చేయడానికి ముందు అతను ఒక వీడియోను కూడా రికార్డ్ చేశాడు. నేను “ఉగ్రవాది”ని కాను, నా డిమాండ్లు ఆర్థికమైనవి కావు, నైతికమైనవి అని పదే పదే చెప్పాడు.

రోహిత్ ఆర్య పంపిన బెదిరింపు సందేశం ఏమిటి?

రోహిత్ ఆర్య స్టూడియో లోపల నుండి స్వయంగా రికార్డ్ చేసిన ఒక వీడియోను విడుదల చేశాడు. అది ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. “నేను, రోహిత్ ఆర్య, ఒక ప్రణాళిక వేసుకుని ఆత్మహత్యకు బదులుగా కొంతమంది పిల్లలను ఇక్కడ బందీలుగా ఉంచాను”. నాకు ఎక్కువ డిమాండ్లు లేవు. నావి చాలా సాధారణమైన డిమాండ్లు, చాలా నైతికమైనవి. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి ఎవరికీ హాని కలిగించేలా నన్ను ప్రేరేపించకండి. ఏదైనా తప్పుడు చర్య తీసుకుంటే, నేను ప్రతిదానికీ నిప్పు పెడతాను” అని ఆ వీడియోలో హెచ్చరించాడు ఆర్య.

బందీలుగా ఉన్న పిల్లలను కమాండోలు ఎలా రక్షించారు?
పోలీసులు తొలుత ఆర్యతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు. కానీ రోహిత్ ఆర్య తన డిమాండ్లను వదులుకోవడానికి నిరాకరించాడు. చర్చలు విఫలం కావడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాత్రూమ్ ద్వారా బలవంతంగా ప్రవేశించారు. 8 మంది కమాండోలతో కూడిన బృందం బాత్రూమ్ ద్వారా ఆడిషన్ గదిలోకి చొరబడింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పిల్లల బందీ సంక్షోభాన్ని ముగించడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ కి 35 నిమిషాలు పట్టింది. లీడ్ కమాండర్ చర్చలు జరపడానికి ప్రయత్నించాడు. కానీ తుపాకీ, రసాయనాలు, లైటర్‌తో కూడిన ఆయుధాలు ధరించిన ఆర్య, గదిని కాల్చివేస్తానని లేదా నిప్పంటిస్తానని పదే పదే బెదిరించాడు. చర్చలు విఫలం కావడంతో ఆర్య తుపాకీతో కాల్పులు జరిపాడు. అంతే కమాండోలు ఎదురు దాడికి దిగారు. కమాండోల కాల్పుల్లో ఆర్యకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించాడు.

సాయంత్రం 5 గంటలకు 19 మంది బందీలను సురక్షితంగా కాపాడారు పోలీసులు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటన స్థలం నుండి ఎయిర్ గన్, రసాయనాలు, లైటర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఘర్షణ సమయంలో ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ ముంబై పోలీసులు తమ చర్యను సమర్థించుకున్నారు. అతని నుండి ఒక తుపాకీ, కొన్ని రసాయనాలు, లైటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. “ఆర్య డిమాండ్లతో సంబంధం లేకుండా, మేము అతడిని ప్రజల జీవితాలతో ఆడుకోనివ్వలేదు. అతను మొదట పోలీసులపై కాల్పులు జరిపాడు. మా బృందం ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపింది. వేరే మార్గం లేదు” అని నగర పోలీసు కమిషనర్ దేవన్ భారతి తెలిపారు.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తెలిసిన విషయం ఏమిటంటే, ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని రోహిత్ ఆర్య ఆరోపించాడు. తన నిరసనలను వారు పట్టించుకోకపోవడంతో అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పిల్లలను బందీలుగా మార్చుకున్నాడు. పిల్లలను పోలీసులు సేఫ్ గా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆర్యను ఎందుకు కాల్చి చంపారు అనేది మిస్టరీగా మారింది. దీనిపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి.

Also Read: 3గంటలు రోడ్డుపైనే.. కనీసం ఒక్కరు స్పందించినా.. ప్రాణాలతో బతికేవాడు.. బెంగళూరులో కారుతో గుద్ది చంపిన కేసులో గుండెలు పిండే విషాదం..