Hyderabad House: మోదీ, పుతిన్ భేటీ జరిగే రూ.400 కోట్ల లగ్జరీ ప్యాలెస్ ఇదే.. దీనికి, హైదరాబాద్ కి లింక్ ఏంటంటే..
ఒకప్పుడు నిజాం అపారమైన సంపదకు, బ్రిటీష్ పాలనలో ఆయన ఉన్నత హోదాకు గుర్తుగా నిర్మించబడిన ఈ అద్భుత కట్టడం..
Hyderabad House: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన ల్యాండ్ అయ్యారు. పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన పుతిన్ కు భారత ప్రధాని మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. పుతిన్ విమానం నుంచి కిందకు దిగగానే.. ప్రధాని మోదీ తన సెక్యూరిటీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ.. పుతిన్ దగ్గరికి వెళ్లి స్వయంగా వెల్ కమ్ చెప్పడం విశేషం. పుతిన్ ను భారత్ కు ఫ్రెండ్ గా భావిస్తారు. అలాంటి వ్యక్తి కోసం ప్రధాని మోదీ ప్రోటోకాల్ ను సైతం బ్రేక్ చేశారు. కాగా, నాలుగేళ్ల తర్వాత పుతిన్ భారత్ వచ్చారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ ఇండియా రావడం ఇదే తొలిసారి. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా మోదీతో ఆయన సమావేశం కానున్నారు.
భారత పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఆతిథ్యం ఇవ్వడానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన హైదరాబాద్ హౌస్‌లో పుతిన్ బస చేయనున్నారు. 1 అశోక్ రోడ్‌లో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని.. ప్రస్తుతం ప్రధాని స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉపయోగిస్తున్నారు. పుతిన్ సహా ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తూ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోంది హైదరాబాద్ హౌస్. ఐకానిక్ హైదరాబాద్ హౌస్.. ఇండియా గేట్ సమీపంలో ఉన్న ల్యాండ్‌మార్క్ భవనం. ఢిల్లీలో దౌత్య విందులకు.. సందర్శనకు వచ్చే దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు బస చేయడానికి ప్రభుత్వం దీన్ని ఉపయోగిస్తోంది.
హైదరాబాద్ సంస్థానం 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 8.2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి.. అందులో 1926లో హైదరాబాద్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. బ్రిటీష్ వాళ్లు సమావేశానికి పిలిచినప్పుడల్లా ఆయన ఎక్కడో బస చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలోని ఇతర రాజ నివాసాలలో బికనీర్ హౌస్, బరోడా హౌస్, పాటియాలా హౌస్ ఉన్నాయి.
ఒకప్పుడు నిజాం అపారమైన సంపదకు, బ్రిటీష్ పాలనలో ఆయన ఉన్నత హోదాకు గుర్తుగా నిర్మించబడిన ఈ అద్భుత కట్టడం.. ప్రస్తుతం భారతదేశ విదేశాంగ సంబంధాలకు కీలక కేంద్రంగా మారింది. బ్రిటీష్ పాలకులు తమ రాజధానిని ఢిల్లీకి తరలించినప్పుడు.. చివరి నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కీర్తికి తగిన స్థలాన్ని కోరుకున్నారు. వైస్రాయ్ హౌస్‌కు దగ్గరగా స్థలం దక్కనప్పటికీ.. కింగ్స్ వే (ప్రస్తుత రాజ్‌పథ్) చివరన.. ప్రిన్సెస్ పార్క్‌లో హైదరాబాద్, బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్ వంటి ఐదు ప్రధాన సంస్థానాలకు స్థలాలను కేటాయించారు. అయితే.. నిజాం రాజు కోరిక మేరకు.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్, వైస్రాయ్ హౌస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ హైదరాబాద్ హౌస్ ప్యాలెస్‌ను రూపొందించారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు..
1937లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన నిజాం అపారమైన సంపదను కలిగి ఉన్నారు. గొప్ప నివాసాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఖర్చు విషయంలో అస్సలు తగ్గలేదు. ఎడ్విన్ లూటియెన్స్ ఈ భవనాన్ని వైస్రాయ్ హౌస్ (ఇప్పుడు రాష్ట్రపతి భవన్) నుండి ప్రేరణ పొంది.. నియో-క్లాసికల్, రోమన్ నిర్మాణ అంశాల సమ్మేళనంతో రూపొందించారు.
దీని నిర్మాణానికి దాదాపు 50 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం. అయితే, 1926లో ఖర్చు చేసిన 50 లక్షల కచ్చితమైన విలువను లెక్కించడం కష్టం. ఎందుకంటే ఆ కాలం నుండి స్థిరమైన ద్రవ్యోల్బణ డేటా అందుబాటులో లేదు. గత శతాబ్దంలో దాదాపు 7శాతం అనే ఊహాత్మక సగటు ద్రవ్యోల్బణ రేటును ఉపయోగించి ఆ ఖర్చు నేడు 378 కోట్ల రూపాయలకు సమానం.
8.2 ఎకరాలు.. 36 గదులు..
1926లోనే భారీ వ్యయంతో ఈ హైదరాబాద్ హౌస్‌ను నిర్మించారు. ఎడ్విన్ లూటియన్స్.. తన పాత డిజైన్ల ఆధారంగా సీతాకోకచిలుక ఆకారంలో ఈ హైదరాబాద్ హౌస్‌ను నిర్మించారు. 8.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్.. 36 గదులు, మొఘల్ నమూనాలతో యూరోపియన్ శైలి కట్టడాలు, గంభీరమైన మెట్ల మార్గాలు, మధ్యలో ఒక గోపురం కలిగి ఉంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ యూనియన్‌లో విలీనమైన తర్వాత.. ఈ ప్యాలెస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.
బర్మా నుండి తెచ్చిన టేకు కలపను ఉపయోగించారు. ఫర్నీచర్ లండన్ హోటల్ సూట్ నుండి ప్రేరణ పొందింది. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ లను కూడా న్యూయార్క్ నుండి దిగుమతి చేసుకున్నారు. దీని నిర్మాణానికి మొదట్లో 26 లక్షల రూపాయలు మంజూరు చేసినా.. తుది ఖర్చు రెట్టింపు అయింది. నిజాం వాస్తు శిల్పికి అవసరమైన విధంగా ఖర్చు చేయడానికి అనుమతించారు.
ఆ కాలంలోని అత్యంత ప్రసిద్ధ చిత్రకారుల కళాకృతులు ఇందులో ఉన్నాయి. లాహోర్ నుండి అబ్దుల్ రెహమాన్ చుగ్తాయ్ వేసిన 30 చిత్రాలను 12,000 కు కొనుగోలు చేశారు. ఇరాక్ పర్షియా నుండి తివాచీలు దిగుమతి చేసుకున్నారు. 500 మంది అతిథులు వరకు వసతి కల్పించడానికి డైనింగ్ హాల్ నిర్మించారు. ఇంత ఖర్చు చేసినా.. ఈ ఇల్లు పాశ్చాత్య శైలిలో ఉందని భావించిన నిజాం.. దాన్ని అంతగా ఇష్టపడలేదు. చాలా అరుదుగా ఈ హౌస్ ను సందర్శించారు. 1954లో ఆయన చివరిసారిగా ఢిల్లీకి వెళ్లినప్పుడు హైదరాబాద్ హౌస్‌లో విలాసవంతమైన పార్టీ ఇచ్చారు. దీనికి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన మంత్రి నెహ్రూ, ఎలియనోర్ రూజ్‌వెల్ట్ తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్ హౌస్ ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంది. దీనిని 1954లో భారత ప్రభుత్వం లీజుకు తీసుకుంది. భారత పర్యాటక అభివృద్ధి సంస్థ.. హైదరాబాద్ హౌస్ నిర్వహణ, క్యాటరింగ్ సేవలను నిర్వహిస్తుంది.
Also Read: 19 ఇళ్లు, 700 కార్లు, 58 విమానాలు.. పుతిన్ ఆస్తుల చిట్టా.. చూస్తే మైండ్ బ్లాంక్
