Bengaluru Incident: 3గంటలు రోడ్డుపైనే.. కనీసం ఒక్కరు స్పందించినా.. ప్రాణాలతో బతికేవాడు.. బెంగళూరులో కారుతో గుద్ది చంపిన కేసులో గుండెలు పిండే విషాదం..

దర్శన్ బైక్ ని ఢీకొట్టిన మనోజ్ కుమార్ (32), అతడి భార్య ఆరతి శర్మ (30) లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Bengaluru Incident: 3గంటలు రోడ్డుపైనే.. కనీసం ఒక్కరు స్పందించినా.. ప్రాణాలతో బతికేవాడు.. బెంగళూరులో కారుతో గుద్ది చంపిన కేసులో గుండెలు పిండే విషాదం..

Updated On : October 30, 2025 / 7:45 PM IST

Bengaluru Incident: బెంగళూరు హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనుషుల్లో మానవత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాటి మనిషి ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని వైనం కళ్లకు కడుతుంది. ఆ సమయంలో అటుగా వెళ్లిన వారిలో ఒక్కరంటే ఒక్కరు స్పందించి ఉన్నా.. ఆ డెలివరీ బాయ్ ప్రాణాలతో బతికేవాడేమో. అతడి కుటుంబం అనాథగా మారేది కాదేమో.

కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని డెలివరీ బాయ్ ని దంపతులు వెంటాడి మరీ కారుతో గుద్ది చంపేసిన ఘటన బెంగళూరులో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి గుండెలు పిండే విషాదకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మృతుడు దర్శన్ బావమరిది మహేష్ ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు తెలిపాడు. అక్టోబర్ 26న తెల్లవారుజామున 12.30 గంటలకు తన స్నేహితుడి నుండి ప్రమాదం గురించి తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. దర్శన్ జెప్టోలో పని చేస్తున్నాడని, తన స్నేహితుడు వరుణ్ తో కలిసి సాయంత్రం ఇంటి నుండి బయలుదేరాడని తెలిపాడు. 24 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్ దర్శన్‌ను దంపతులు కారుతో ఢీకొట్టి హత్య చేశారని అతడు ఆరోపించాడు.

”దర్శన్ బైక్ ని ఢీకొట్టిన మనోజ్ కుమార్ (32), అతడి భార్య ఆరతి శర్మ (30) లను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ రోజంతా ఎక్కడున్నా.. రాత్రి 11గంటలకు ఇంటికి చేరుకునే వాడు. కానీ, ఆ రోజు అతడు ఇంటికి తిరిగి రాలేదు. నా సోదరిని దర్శన్ పెళ్లి చేసుకున్నాడు. రాత్రి 11 గంటలు దాటినా దర్శన్ ఇంటికి రాలేదు. అతను తన స్నేహితుడి ఇంట్లో ఉంటాడని అనుకుని మేమంతా నిద్రపోయాము. కానీ రాత్రి 12 గంటల ప్రాంతంలో, నాకు వరుణ్ నుండి కాల్ వచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిందని, అతని చేయి విరిగిందని చెప్పాడు. నేను దర్శన్ గురించి అడిగినప్పుడు, అతను గాయపడ్డాడని చెప్పాడు” అని మహేశ్ గుర్తు చేసుకున్నాడు.

మహేశ్ ఆటోడ్రైవర్. ఉత్తరహళ్లిలో నివాసం ఉంటున్నాడు. జెపి నగర్ సెవెన్త్ ఫేజ్ లోని శ్రీరామ లేఅవుట్ వద్ద ప్రమాద స్థలానికి చేరుకోవడానికి అతను తన ఆటో రిక్షాలో 7 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.

సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే..

”నేను అక్కడికి చేరుకునేసరికి, వరుణ్ గాయపడిన చేతితో కూర్చుని ఉన్నాడు. నేను అతనిని అడిగినప్పుడు, దర్శన్ పడుకున్న ప్రదేశాన్ని అతను నాకు చూపించాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, దర్శన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. మూడు గంటల పాటు అతడు అలానే రోడ్డుపై పడున్నాడు. అటుగా కొందరు వ్యక్తులు వెళ్లారు. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. దర్శన్ ను కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నం కూడా చేయలేదు. నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. వెంటనే మహేష్ ని నేను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాను. అయితే, 20 నిమిషాల క్రితం దర్శన్ మరణించాడని వైద్యులు చెప్పారు. సకాలంలో దర్శన్ ను ఆసుపత్రికి తరలించి ఉంటే, అతను బతికేవాడని డాక్టర్లు చెప్పారు” అని మహేశ్ కన్నీటిపర్యంతం అయ్యాడు.

ఆ జంట ఉద్దేశపూర్వకంగా తమ బావమరిదిని వాహనంతో ఢీకొట్టారని, పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాతే అది ప్రమాదం కాదని తనకు తెలిసిందన్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత ఆ జంట తమను అనుసరిస్తున్నారని దర్శన్ లేదా వరుణ్‌కు తెలుసా అని అడిగినప్పుడు, వరుణ్ చెప్పిన దాని ప్రకారం, వారు కస్టమర్‌కు ఆహారాన్ని డెలివరీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని మహేశ్ చెప్పాడు.

దర్శన్ రెండేళ్ల క్రితం తన తల్లిని కోల్పోయాడు. అతడి కుటుంబానికి దర్శన్ పెద్ద దిక్కు అని, ఎంతో సాయంగా ఉండేవాడని, ఇప్పుడు అతడు లేడని కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. ”గత రెండేళ్లలో దర్శన ఎన్నో ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. తొలుత స్విగ్లీలో పని చేశాడు. ఇప్పుడు జెప్టోకి పని చేస్తున్నాడు. నెలకు 25వేలు రూపాయలు సంపాదించేవాడు. కుటుంబానికి ఆర్థికంగా సాయంగా ఉండేవాడు. దర్శన్ మృతికి న్యాయం జరగాలి. ఇప్పుడు అతడి కుటుంబానికి దిక్కు ఎవరు?” అని మహేశ్ బోరున విలపించాడు.

తమ కారు సైడ్‌ మిర్రర్‌కు బైక్ తాకిందని.. ఓ జంత అత్యంత రాక్షసంగా ప్రవర్తించింది. బైకర్ ను వెంటాడి మరీ కారుతో గుద్ది చంపేశారా దంపతులు. బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మనషుల్లో పెరిగిపోతున్న రాక్షసత్వానికి అద్దం పట్టింది. మనిషి ప్రాణానికి విలువే లేకుండా పోయింది. కారు అద్దానికి ఇచ్చిన ప్రయారిటీ.. ఓ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది.

 

Also Read: క్రికెట్ ప్ర‌పంచంలో తీవ్ర విషాదం.. ఫిల్ హ్యూస్ త‌ర‌హాలోనే.. మెడ‌కు బంతి త‌గిలి 17 ఏళ్ల యువ క్రికెట‌ర్ మృతి