#9YearsOfModiGovernment: దేశంలో 2014కి ముందు పరిస్థితి ఎలా ఉండేది?: మోదీ

కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.

#9YearsOfModiGovernment: దేశంలో 2014కి ముందు పరిస్థితి ఎలా ఉండేది?: మోదీ

Narendra Modi

Updated On : May 31, 2023 / 7:54 PM IST

#9YearsOfModiGovernment – Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగనున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ ఆ రాష్ట్రంలో బీజేపీ (BJP) మహా జన్‌సంపర్క్ (Maha Jansampark) ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని అజ్మీర్ లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ గత యూపీఏ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

” దేశంలో 2014కి ముందు పరిస్థితి ఎలా ఉండేది? అవినీతిని తట్టుకోలేక ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేసేవారు. దేశంలోపి పెద్ద నగరాల్లో ఉగ్రదాడులు జరిగేవి. దేశ సరిహద్దుల వద్ద రోడ్లు నిర్మించడానికి కాంగ్రెస్ సర్కారు భయపడింది. అప్పట్లో మహిళలపై నేరాలు అధికంగా జరిగేవి. ప్రధాని కంటే సూపర్ పవర్ దేశంలో ఉండేది. రిమోట్ కంట్రోల్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. యువత జీవితాల్లో చీకట్లు కమ్ముకుని ఉండేవి. ఇప్పుడు భారత్ ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోంది.

దేశం సాధించిన విజయాలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాం. దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా? కాంగ్రెస్, ఇతర కొన్ని పార్టీలు దానిపై కూడా బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి అహం ముందు పేద కుటుంబానికి చెందిన నేను నిలబడడంతో వారు కోపంతో ఊగిపోతున్నారు. వారి అవినీతిని, వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తున్నందుకు ఆగ్రహంతో ఉన్నారు” అని మోదీ చెప్పారు.

#9YearsOfModi Govt : మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు .. మరెన్నో సంచలన నిర్ణయాలు