National Herald Case: సోనియా, రాహుల్ గాంధీకి షాక్.. రూ.661 కోట్ల ఆస్తులు సీజ్
నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే AJL యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు షాక్ ఇచ్చింది వారితో సంబంధం ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఈడీ తెలిపింది.
సీజ్ చేసిన వాటిలో ఢిల్లీ, ముంబై, లక్నోలలో ప్రధాన ఆస్తులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్‌లోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్ కూడా ఉంది.
Also Read : దేశంలో హైఅలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల వార్నింగ్.. ఆ ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచన
ఇది AJL మనీలాండరింగ్ కేసులో భాగంగా తీసుకున్న చర్య అని ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 8, మనీలాండరింగ్ నిరోధక (అటాచ్డ్ లేదా ఫ్రీజ్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం) నియమాలు, 2013 ప్రకారం సంబంధిత నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ అధికారులు వివరించారు. AJL, యంగ్ ఇండియన్లకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ నవంబర్ 2023లో ఈ స్థిరాస్తులు జప్తు చేసింది.
నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే AJL, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. ఈ కంపెనీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు చెరో 38% వాటాను కలిగి ఉన్నారు. వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. “యంగ్ ఇండియన్, AJL ఆస్తులను.. రూ.18 కోట్ల మేర నకిలీ విరాళాలు, రూ.38 కోట్ల మేర నకిలీ ముందస్తు అద్దె, రూ. 29 కోట్ల మేర నకిలీ ప్రకటనల రూపంలో నేరం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఉపయోగించారు” అని ఈడీ ఆరోపించింది.