NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ లీక్.. రంగంలోకి సీబీఐ.. ఇది ఎవరి పని?
నీట్ పేపర్ లీక్, రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు.
NEET UG 2026 Paper Leak CBI
NEET UG 2026 Paper Leak: ప్రతిష్టాత్మకమైన నీట్ యుజి పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాఫ్తు చేపట్టింది. గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చింది? లీక్ వెనుక ఏదైనా ముఠా ఉందా? అన్న కోణంలో దర్యాఫ్తు జరుగుతోంది. మే 3న జరిగిన ఈ పరీక్ష పారదర్శకతపై కేంద్రం దర్యాఫ్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించడంతో పరీక్ష విధానం అపహాస్యం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జాతీయ పరీక్ష వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దర్యాఫ్తునకు అవసరమైన అన్ని రికార్డులు, డేటాను ఎన్టీఏ స్వయంగా సీబీఐకి అందించనుంది.
నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనే వార్తలు రాజస్తాన్ లో కలకలం రేపాయి. దర్యాఫ్తు సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు కేంద్రం గుర్తించింది. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది.
రద్దు చేసిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నారు. కొత్త తేదీలను ఎన్టీఏ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించనుంది. అయితే, రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. పాత హాల్ టికెట్లు, కొత్త అడ్మిట్ కార్డుల ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా పరీక్షకు హాజరు కావొచ్చని అధికారులు చెప్పారు. అయితే నీట్ పేపర్ లీక్, రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. 24 లక్షల మంది విద్యార్థుల ఆశలను ఆవిరి చేశారని మండిపడుతున్నారు.
దాదాపు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ప్రాక్టీస్ పేపర్ ను గుర్తించినట్లు రాజస్తాన్ అడిషనల్ డీజీపీ వెల్లడించారు. రాజస్తాన్ లోని శిఖార్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
నీట్ పేపర్ లీక్, రద్దు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు భగ్గుమంటున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి, సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, నీట్ పరీక్షను పూర్తి స్థాయిలో భద్రతా నిబంధనల మధ్య నిర్వహించామని ఎన్టీఏ తెలిపింది. ప్రశ్నాపత్రాలను ప్రత్యేకమైన జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల్లోనే రవాణ చేశామని, పరీక్ష కేంద్రాలను కూడా కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షించామని ఎన్టీఏ వివరించింది. పూర్తి ప్రోటోకాల్ నడుమ పరీక్ష నిర్వహించామని పేర్కొంది. మరి పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత పేపర్ లీక్ ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
పరీక్ష రద్దుతో విద్యార్థుల మానసిక స్థితిపై ప్రభావం..
కాగా పేపర్ లీక్ ఆరోపణలతో నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో విద్యార్థుల మానసిక స్థితిపై దీని ప్రభావం స్పష్టంగా పడుతుందని విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీల నేతలు వాపోతున్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్రాని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. నీట్ పరీక్ష రద్దుతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
