సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఏం కావాలంటే..

సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఏం కావాలంటే..

Updated On : December 20, 2019 / 4:01 AM IST

సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. భారత జాతీయతను రుజువు చేసుకోవచ్చు. 

తాజాగా సీఏఏ, ఎన్ఆర్సీలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, సమాజంలో చీలికలు వస్తుండటంతో విపక్షాలు, హక్కుల సంఘాలు రచ్చలేపుతున్నాయి. వీటిని అడ్డుకునే దిశగా వివరణ ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమల్లోకి వస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా నిబంధనలు రూపొందిస్తామన్నారు. దానికి మతంతో సంబంధం ఉండదని చెప్పారు. ప్రతి భారతీయుడి పేరు నమోదవుతుందని వివరించారు. 

పుట్టిన ప్రదేశం, తేదీ వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన పత్రాలపై ఇంకా నిర్ణయించాల్సి ఉంది. వీటిలో ఓటరు కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌, లైసెన్సులు, బీమా పత్రాలు, జన్మ ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి సర్టిఫికెట్లు వంటి వాటితో పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 

సదరు వ్యక్తి నిరక్షరాస్యుడై ఎలాంటి సర్టిఫికేట్లు లేకపోతే సాక్షులు, సామాజిక పరిశీలనను అనుమతిస్తామని, భారత పౌరుడికి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 1971కు ముందు పూర్వీకుల పత్రాలేవీ ఇవ్వనవసరం లేదన్నారు. అసోంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీకే అది పరిమితమని వివరించారు. 

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వేర్వేరు ప్రక్రియలని చెప్పారు. ఎన్‌ఆర్‌సీ అనేది పౌరులు సంబంధిత జాబితాలో పేరును నమోదు చేసుకునే సాధారణ ప్రక్రియని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 2009 నాటి పౌరసత్వ నిబంధనల ప్రాతిపదికన వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధరిస్తామని వెల్లడించారు.