రేషన్ కార్డుదారులకు ఊరట, క్లారిటీ ఇచ్చిన కేంద్రం

No proposal to hike food grains prices: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద రేషన్ దుకాణాల ద్వారా విక్రయించే ఆహార ధాన్యాల ధరలు పెంచే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బియ్యం, గోధుమను కిలోకు రూ.3, రూ.2కు విక్రయించనున్నట్టు చెప్పారు. ఆహార భద్రతా బిల్లును తగ్గించుకోవడానికి పీడీఎస్ కింద విక్రయించే ఆహార ధాన్యాల ధరలను పెంచాలని ఆర్థిక సర్వే 2021 సూచించిన నేపథ్యంలో రేట్లను పెంచే యోచనలో కేంద్రం ఉందా అని వర్చువల్ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు గోయెల్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలోని 81 కోట్లకుపైగా ప్రజలకు ఆహార ధాన్యాలను కిలోకు రూ.1-3కు సరఫరా చేస్తోందన్నారు.
2013లో యూపీఏ హయాంలో తెచ్చిన ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఆహార ధాన్యాల ధరలను మూడేళ్లకు ఒకసారి సవరించే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం తెచ్చినప్పటి నుంచి ధరలను సవరించ లేదు.
రేషన్ కార్డు పోర్టబిలిటీపైనా మంత్రి మాట్లాడారు. రెండేళ్ల క్రితం వన్ నేషన్, వన్ రేషన్ కార్డు ప్రారంభమైనప్పటి నుంచి రేషన్ కార్డు పోర్టబిలిటీ ద్వారా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 1.5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద మంజూరు చేసిన రేషన్ కార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. 91 శాతం కార్డులకు ఆధార్ అనుసంధానం పూర్తయినట్లు వివరించారు.