farmer built E-vehicle : ఎలక్ట్రిక్ కారు తయారు చేసిన రైతు..సౌరశక్తితో కూడా నడుస్తుంది..!!

Farmer Built Electric Vehicle
farmer built electric vehicle : రైతులంటే పొలం వెళ్లి విత్తనాలు చల్లి..వ్యవసాయం చేయటం అనే అనుకుంటాం. కానీ రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తారనీ..ఇంజనీర్లలాగా కొత్త యత్నాలను తయారు చేస్తారని అనుకోనే అనుకోరు. కానీ రైతన్నలకు కోపం వస్తే..వారి హక్కులకు విఘాతం కలిగితే దేశ ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారని..అలుపెరుగని ఆందోళనలు చేస్తారని ఇప్పటికే దేశ రాజధాని శివారుల్లో రైతులు నిరూపిస్తున్నారు. అంతేకాదు.. రైతులో ఓ ఇంజనీర్ కూడా దాగున్నాడని నిరూపించాడు.
ఒడిశాకు చెందిన ఒక రైతు వినూత్న ఆవిష్కరణ చేసి అందరి మనస్సులు ఆకట్టుకున్నాడు. ఒఢిశాలోని మథూర్‌భంజ్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ స్వతహాగా రైతు. అతను దేశీయ పరికరాలతో నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసి..అందరి దృష్టిని ఆకర్షించాడు. సుశీల్ అగర్వాల్ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీతోనే కాదు..సౌరశక్తితో కూడా నడవటం విశేషం..
సుశీల్ తయారు చేసిన ఈ వాహనంలో 850 వాట్ల మోటార్, 100ఎహెచ్/54 ఓల్ట్స్ బ్యాటరీని అమర్చాడు. ఈ వాహనం ఫుల్ ఛార్జింగ్‌తో 300 కిలోమీటర్ల దూరం వరకూ నడుస్తుంది. పెట్రోలు ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆవిష్కరణ ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. సుశీల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ బ్యాటరీ సుమారు 8 గంటలలో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. అలాగే ఈ బ్యాటరీ 10 ఏళ్ల పాటు పనిచేస్తుందని సుశీల్ అగర్వాల్ తెలిపారు. తాను ఈ వాహనం తయారు చేయటానికి మూడు నెలలు పట్టిందని సుశీల్ తెలిపారు. లాక్ డౌన్ లో బోర్ కొట్టి ఏదోకటి చేద్దామని అనుకుంటూ ఈ వాహనాన్ని తయారు చేశానని తెలిపారు.