Odisha Train Accident: ఇంకా వందకుపైగా మృతదేహాలు.. చికిత్స పొందుతున్న 200 మంది క్షతగాత్రులు
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.

Odisha Train Accident
Train Accident: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో సోమవారం సాయంత్రం వరకు 278 మంది మరణించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శావాగారంలో కుప్పలుగా మృతదేహాలు పడిఉన్నాయి. అయితే, ముఖాలు ఛిద్రమవడంతో చనిపోయింది ఎవరో గుర్తు పట్టలేని దుస్థితి నెలకొంది. మరోవైపు తమవారి ఆచూకీ తెలియక కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో రైలు ప్రమాదంలో మృతదేహాలను ఉంచిన ప్రాంతంలో దయనీయ పరిస్థితి నెలకొంది.
Odisha Train Accident: రైలు ప్రమాదంపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం
రైలు ప్రమాదం చోటుచేసుకొని ఐదు రోజులు అవుతుంది. ఇప్పటి వరకు 278 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. సోమవారం సాయంత్రం వరకు 177 మృతదేహాలను వారి సంబంధికులకు అప్పగించారు. మరో 101 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. అవన్నీ భువనేశ్వర్ ఎయిమ్స్ మార్చరీలో ఉంచారు. బాధితుల కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు అక్కడికి తరలివస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో వెయ్యి మందికిపైగా గాయాల పాలైనట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీరిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ తమవారి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని చనిపోయినవారు, చికిత్స పొందుతున్న వారి వివరాలను ఒడిశా ప్రభుత్వం స్పెషల్ రిలీఫ్ కమిషనర్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్లలో ఉంచింది. అంతేకా, అవసరమైన వారు రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139, భవనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నెంబర్ 18003450061 లేదా 18003451929కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని రైల్వే శాఖ తెలిపింది.