మోడీ రాడార్ థియరీ: నెటిజన్లు, నాయకుల వ్యంగ్యాస్త్రాలు

  • Published By: vamsi ,Published On : May 13, 2019 / 06:13 AM IST
మోడీ రాడార్ థియరీ: నెటిజన్లు, నాయకుల వ్యంగ్యాస్త్రాలు

Updated On : May 13, 2019 / 6:13 AM IST

బాలాకోట్‌ దాడుల వ్యూహరచనలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టాయి. మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్‌పై దాడి చేసిందని చెప్పగా.. ఈ వ్యాఖ్యలను విపక్షాలతో పాటు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. 
వాస్తవానికి రాడార్ల పనితీరును మేఘాలు ప్రభావితం చేయలేవు. మేఘాలు దట్టంగా అలుముకున్న సమయంలో కూడా వాతావరణంలో రాడార్లు పనిచేస్తాయి. అయితే మోడీ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మేఘాలు దట్టంగా ఉన్నా, అవతల ఏముందో పసిగట్టేందుకే రాడార్ టెక్నాలజీ రేడియో తరంగాలను వాడతారని, ఆరోజు బాలాకోట్​ ఏరియాలో మేఘాల వల్ల ఐఏఎఫ్​కి ఎలాంటి అదనపు ఉపయోగం లేదని పలువురు రాడార్​ నిపుణులు చెబుతున్నారు.

‘‘జుమ్లా(మోసపూరిత మాటలు) చెప్పడం మోడీకి అలవాటే. గడిచిన ఐదేండ్లుగా ఆయన చేస్తున్నది అదే. మేఘాలు అడ్డున్నా, రాడార్లకు చిక్కకుండా మోసం చేస్తూనే ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ విమర్శించింది.

‘‘నేషనల్​ సెక్యూరిటీ ఎంత కీలకమైందో తెలిసి కూడా దాని విలువను తగ్గించేలా మోడీ మాట్లాడారు. బాధ్యతారాహిత్య కామెంట్లతో  దేశభద్రతకు డ్యామేజ్​ చేశారు. ఇందుకాయన సిగ్గుపడాలి. ఇలా మాట్లాడే వ్యక్తి ప్రధానిగా ఉండటానికి అనర్హుడు’’ అంటూ సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మేఘాలు అడ్డుంటే పాకిస్థాన్​ రాడార్లు పనిచేయవన్న సీక్రెట్​ మోడీ మాటలతో బయటపడింది. భవిష్యత్తులో దాడులకు పనికొచ్చే అంశమిది. అన్నట్టు, బీజేపీ ట్వీట్లు ఏమైనట్లు? మేఘాల్లో కలిసిపోయాయా?’’ అంటూ ఎన్సీ నేత ఒమర్​ అబ్దుల్లా అన్నారు.

‘‘బాలాకోట్​పై దాడుల్ని ప్రశ్నించినప్పుడు నాపై దెమ్మెత్తిపోశారు. ఇప్పుడు మోడీ చెప్పిన క్లౌడ్​ థియరీ పాకిస్థాన్​ విమర్శనాస్త్రంగా మారింది. మన భద్రతా బలగాలకు ఇంత అవమానం అవసరమా అన్నదే నా బాధ’’  అంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ విమర్శించారు.