మోడీకి 100కోట్ల మంది మద్దతుంది..విపక్షాల ర్యాలీపై షా విమర్శలు

కోత్ కతాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ర్యాలీ 9మంది ప్రధాని అభ్యర్ధులు కనిపించారని ఆయన అన్నారు. మంగళవారం(జనవరి 22,2019) వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా.. 20-25మంది నేతలు చేతులు కలిపినా ప్రధాని మోడీని ఓడించలేరని అన్నారు. అధికారం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటవుతోందన్నారు. మోడీకి 100 కోట్ల మంది మద్దతుందని తెలిపారు.
ప్రతిపక్షాల ర్యాలీలో వారు భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలు చేయలేదని షా విమర్శించారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సర్కారుపై షా తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ పరిపాలనా విభాగం అంతా రాజకీయ రంగు పులుముకుందన్నారు. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ బలపడుతోందన్న భయంతోనే రాష్ట్రంలో రథయాత్ర నిర్వహణకు, హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు కూడా మమత సర్కార్ అనుమతులివ్వలేదని, మా యాత్రలను మమత ఆపగలేమో కానీ, ప్రజల హృదయాల్లో నుంచి బీజేపీని చెరిపివేయలేరన్నారు. రాబోయో ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లో బీజేపీ విజయం ఖాయమని తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లును ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మమత వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు.