ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం.. జస్టిస్ యశ్వంత్ వర్మపై 200 మందికిపైగా ఎంపీల అభిశంసన నోటీసులు
లోక్‌సభలో 145, రాజ్యసభలో 63 మంది ఎంపీలు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన నోటీసు సమర్పించారు.

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలు దొరికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎంపీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నారు. సోమవారం మొత్తం 145 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు అభిశంసన నోటీసును సమర్పించారు.
ఈ 145 మంది లోక్‌సభ సభ్యులలో అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడి, పీపీ చౌధరీ, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. జస్టిస్ వర్మపై రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ఆధారంగా నోటీసు ఇచ్చారు.
Also Read: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్.. మిడ్ రేంజ్ ధరలో.. ఖతర్నార్ ఫీచర్లు..
లోక్‌సభలో కనీసం 100, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకం చేసిన అభిశంసన నోటీసును సభాపతి/ఛైర్మన్ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అభిశంసనపై కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ మాట్లాడుతూ.. జస్టిస్ వర్మపై అభిశంసన చర్యకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని, ఇండియా బ్లాక్ పార్టీలతో కలసి ముందుకు సాగుతున్నామని చెప్పారు.
కాగా, గత వారం కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. జస్టిస్ వర్మపై అభిశంసన అంశంపై అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. హైకోర్టు జడ్జిని తొలగించడానికి ఎంతో కఠినమైన ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది.