పాక్ మీద రివేంజ్ తీర్చుకోవడానికి భారత్ ముందున్న బెస్ట్ ఆప్షన్లు ఇవే..

రాఫెల్‌, మిరాజ్‌ 2,000తో దాడులు?

పాక్ మీద రివేంజ్ తీర్చుకోవడానికి భారత్ ముందున్న బెస్ట్ ఆప్షన్లు ఇవే..

Updated On : April 25, 2025 / 3:24 PM IST

పహల్గాంలో ఉగ్రవాదులు పాల్పడ్డ దాడితో పాకిస్థాన్‌పై భారత సైన్యం ఎలా ప్రతీకారం తీర్చుకోనుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదేళ్లలో ఇటువంటి ఉగ్రదాడులు జరిగిన తర్వాత భారత సైన్యం దీటుగా స్పందించింది. ప్రణాళికాబద్ధంగా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ సారి కూడా భారత్ దాడి చేయాలనుకుంటే మన సైన్యం ముందు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఈ కింది ఆప్షన్లలో ఏదైనా ఒకదాన్ని భారత్‌ ఉపయోగించుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం..

రాఫెల్‌, మిరాజ్‌ 2,000తో దాడులు
ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ధ విమానాలను వాడుతూ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దాడులు చేయొచ్చు. పాక్‌ సైన్యం అడ్డం వస్తే ఆ దేశ సైనిక కార్యాలయాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది.

అలాగే, మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలను కూడా భారత్‌ వీటి కోసం వాడవచ్చు. గతంలో బాలాకోట్‌పై దాడి జరిపిన తర్వాత భారత్‌కు కొన్ని సమస్యలు వచ్చాయి. అటువంటి సమస్యలు మళ్లీ రాకుండా భారత్‌ ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది.

రాఫెల్‌, మిరాజ్‌ 2000 యుద్ధ విమానాకు శత్రుదేశాల రక్షణ వలయాన్ని సైతం ఛేదించే శక్తి ఉంటుంది. అయితే, ఈ రీతిలో దాడులు చేస్తే భారత్‌కు అంతర్జాతీయంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు కూడా భారత్‌ రెడీగా ఉండాలి.

Also Read: ఇండియా, పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి సత్తా ఎంత? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్… ఎవరి వద్ద ఎన్ని?

భారత్‌ నియంత్రణ రేఖను దాటి దాడులు చేయడం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో సిమ్లా ఒప్పందాన్ని పాక్‌ పక్కనపెడుతున్నట్లు చెప్పింది. సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం జోక్యం లేకుండా భారత్‌, పాకిస్థాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి.

అలాగే, జమ్మూకశ్మీర్‌లో కాల్పుల విరమణ లైన్‌గా నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందం కింద పునర్నిర్వచించారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో నియంత్రణ రేఖను పాక్ గుర్తించనట్లు అవుతుంది కాబట్టి భారత్‌ మరింత వేగవంతంగా సైనిక ఆపరేషన్లు చేపట్టే ఛాన్స్ ఉంది. ఇటీవల ఎల్‌వోసీ వద్ద పాకిస్థాన్‌ పలుసార్లు ఒప్పందనల ఉల్లంఘనలు పాల్పడింది.

పాక్‌ అటువంటి పనులు చేసింది కాబట్టి ఈ కారణాలను చూపుతూ ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్‌ భారత్‌ ఆపరేషన్లు చేపట్టవచ్చు. అక్కడికి చొచ్చుకుని వెళ్లి దాడులు జరపాలంటే, అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను తట్టుకుని భారత దళాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతేగాక, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పాకిస్థాన్‌ దళాలు సిద్ధంగా ఉన్నాయి.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసే ఛాన్స్
పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రణాళికలు పక్కాగా వేసుకోవాలి. భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్‌ చేసే అవకాశం ఉండడంతో పాకిస్థాన్‌ ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. దీంతో భారత్‌ గతంలో కంటే మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌ను బాగా వాడుకునే అవకాశం ఉంది.

శతఘ్నులతో పాటు స్నైపర్లను భారీగా వాడడం
పాక్‌లోని టార్గెట్లను ఛేదించడానికి భారత్‌ శతఘ్నులు, స్నైపర్‌ గన్స్‌ను భారీగా వాడే అవకాశం ఉంది. భారీ మోర్టార్లను సైతం ఉపయోగించవచ్చు. నియంత్రణ రేఖ వద్ద శత్రుస్థావరాలను ధ్వంసం చేయవచ్చు. అయితే, పై మూడు ఆప్షన్లను అమలు చేస్తే జరిగేటంతటి విధ్వంసాన్ని మాత్రం ఈ నాలుగో ఆప్షన్‌ సృష్టించలేదు.