Amit Shah: మోదీ సర్కార్ ఎవరినీ వదలదు, వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది- అమిత్ షా

పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే

Amit Shah: మోదీ సర్కార్ ఎవరినీ వదలదు, వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది- అమిత్ షా

Updated On : May 1, 2025 / 7:04 PM IST

Amit Shah: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయమన్నారు అమిత్ షా. కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నామన్నారు. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే అన్నారు.

”ఇది మోదీ సర్కార్. మోదీ ర్కార్ ఎవరినీ వదిలిపెట్టదు. వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే” అని కేంద్ర హోంమంత్రి అమిత్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: భయంతో వణికిపోతున్న పాక్‌.. హఫీజ్ సయీద్‌ను రక్షించడానికి ఏం చేస్తోందంటే?

ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా టూరిస్టులను కాల్చి చంపారు. మతం పేరుతో నరమేధానికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశ ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు.

ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులను పెంచి పోషించి మనపైకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటున్నారు. మరికొందరు పీవోకేను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.