LOC దగ్గర భారీగా సైన్యాన్ని మొహరిస్తున్న పాక్

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్ ఆగ్రహంతో ఊగిపోతుంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాక్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సొంత దేశంలోని నాయకుల నుంచే పాక్ ప్రభుత్వానికి విమర్శలు ఎదురౌతున్నాయి. శ్రీనగర్ ను సొంతం చేసుకుంటామని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ చెబుతుంటే..భారత్ ఆధీనంలో ఉన్న శ్రీనర్ సంగతి పక్కనబెట్టి ముందు పాక్ ఆధీనంలో ఉన్న మజఫరాబాద్ పోగొట్టుకోకుండా చూసుకోవాలని కొంతమంది పాక్ సీనియర్ రాజకీయ నాయకులు పాక్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారు.
అయితే తన వక్రబుద్ధిని మార్చుకోని పాకిస్థాన్.. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వే సాహసం చేస్తోంది. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోకి పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది. 2వేల ట్రూప్‌లతో కూడిన పాక్ ఆర్మీ పీవోకేకు చేరుకుంది. ఎల్‌వోసీకి కేవలం 30కిలోమీటర్ల సమీపంలో పాక్ 2వేల మంది సైన్యాన్ని మోహరించింది. జమ్మూ కశ్మీర్‌లో చొరబాట్ల ద్వారా అస్థిర వాతావరణాన్ని సృష్టించేందుకూ పాక్ తమ గడ్డ మీద నుంచి ఉగ్రవాదులను ఎగదోసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పీవోకేలో కొత్తగా జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదిన్, లష్కరే ఉగ్రవాద సంస్థలకు చెందిన మూడు క్యాంపులను గత నెలలోనే ఏర్పాటు చేసింది. ఇక్కడే 10వేల ఉగ్రవాదులకు శిక్షణనిచ్చేపనిని ఆ దేశ గూఢచర్య సంస్థ ISI తన భుజానెత్తుకుంది. సరిహద్దు ఆవతల పాక్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత సైనికాధికారులు తెలిపారు.