పాక్ తో ఇకపై క్రికెట్ ఆడేది లేదు: శుక్లా

కొన్ని రాజకీయ కారణాల కారణంగా కొన్నేళ్లుగా కలిసి ఆడేందుకు దూరంగా ఉంటున్న పాక్-క్రికెట్ల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్ పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోన్న తరుణంలో వారితో భవిష్యత్‌లోనూ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆడేందుకు అవకాశం లేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారితో క్రికెట్ సంబంధాలు ఇక మీదట ఉండబోవనే విషయాన్ని స్పష్టం చేశారు.
పుల్వామా ఉగ్రదాడితో ఆ బంధానికి కూడా తెరపడేటట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో క్రికెట్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి రాజకీయాలు, క్రీడలు వేర్వేరని చెబుతుంటాను. కానీ.. తాజాగా జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఇంకా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై ముసుగు వేయడం, మొహాలిలో పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగించడం సరైన నిర్ణయమేనని భావిస్తున్నా. ఉగ్రవాదాన్ని పూర్తిగా వదిలేసే వరకూ పాక్‌తో క్రికెట్ గురించి చర్చలు జరపేది లేదు. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ గురించి కేంద్రం నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నాం’ అని రాజీవ్ శుక్లా తెలిపాడు.
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 16న ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ, ఈ మ్యాచ్‌ను బహిష్కరించి వరల్డ్‌కప్ వేదికగా పాక్ దుశ్చర్యని ప్రపంచానికి తెలియజేయాలని టీమిండియాకి అభిమానులు ఆశిస్తున్నారు.