కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నాడు.. పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు.. ఖర్గే వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఏం చెప్పారంటే..?

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.

కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నాడు.. పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు.. ఖర్గే వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఏం చెప్పారంటే..?

Parliament Monsoon Session

Updated On : July 21, 2025 / 1:44 PM IST

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్, రాజ్యసభలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పలు సార్లు సభలు వాయిదా పడ్డాయి. అయితే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.

Also Read: PM Modi: భారత బలగాల ప్రతాపాన్ని ప్రపంచం చూసింది.. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కీలక సూచన

దేశంపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంతో ఐక్యంగా నిలిచాయి. ఆ సమయంలో కాంగ్రెస్ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. సైన్యం నైతికతను పెంచడానికి మేము మద్దతు ఇచ్చాము. పహల్గామ్ దాడి ఏప్రిల్ 22న జరిగింది. ఇప్పటి వరకు ఉగ్రవాదులను పట్టుకోలేదు. పహల్గామ్, ఆపరేషన్ సిందూర్ గురించి మీరు ప్రపంచానికి చెప్పిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నిఘా వైఫల్యం జరిగిందని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ప్రకటన చేశారు. మీరు మా నుండి సహాయం తీసుకున్నారు. మాకు అన్ని విషయాలు వివరించాలి. ఆపరేషన్ సిందూర్ విషయంలో నేను ఒప్పందం కుదిర్చిన తరువాతే కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24సార్లు పేర్కొన్నారు. ఇది దేశానికి అవమానకరం. కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నారు. ప్రభుత్వం అన్ని విషయాలపై సమాధానం చెప్పాలి.. అంటూ మల్లిఖార్జున్ ఖర్గే ప్రశ్నించారు.


రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ గురించిన ప్రతి అంశాన్ని ప్రపంచం ముందు ఉంచుతాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగినట్లుగా ఇలాంటి ఆపరేషన్ ఎప్పుడూ జరగలేదు. మోదీ నాయకత్వంలో ప్రతిదాని గురించి చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.