Parliament: సర్వం సిద్ధం.. జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. కరోనా మూడో వేవ్ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహించాలని సందిగ్ధం నెలకొంది.

Parliament: సర్వం సిద్ధం.. జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

Parliament

Updated On : January 25, 2022 / 8:34 AM IST

Parliament: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. కరోనా మూడో వేవ్ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహించాలని సందిగ్ధం నెలకొనగా.. గతంలో మాదిరిగానే పార్లమెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, లోక్‌సభ, రాజ్యసభ రెండు వేర్వేరు సమయాల్లో నడిపేందుకు సిద్ధం అవుతున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం జనవరి 31వ తేదీన ఉంటుందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి లోక్‌సభ, రాజ్యసభ రోజుకు ఐదేసి గంటల పాటు.. వేర్వేరు సమయాల్లో నడుస్తాయి. కొవిడ్‌ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 11గంటలకు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు నుంచి 11వ తేదీ వరకూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సభ నడుస్తుంది. రాజ్యసభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఇక మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8 వరకూ రెండో దశ సెషన్లను నిర్వహించనున్నారు.

కరోనా కారణంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో నిర్వహించాయి. అయితే, థర్డ్‌ వేవ్‌తో పార్లమెంట్ సమావేశాల సమయం కుదించారు. పార్లమెంట్ పనివేళలపై బలిటెన్ విడుదల చేసింది లోక్‌సభ సచివాలయం.. జనవరి 31వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌‌లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11గంటలకు 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్‌ హాల్‌లలో సీట్లు ఏర్పాటు చేశారు.