దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనలు.. బంకుల వద్ద భారీగా బారులు తీరిన జనాలు

కొత్త హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మరోవైపు పెట్రోలు కొరత ఏర్పడుతుందనే భయంతో భారీ ఎత్తున జనం బంకుల వద్ద బారులు తీరారు.

దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనలు.. బంకుల వద్ద భారీగా బారులు తీరిన జనాలు

Truck Drivers Protest Effect

Updated On : January 2, 2024 / 5:24 PM IST

Truck Drivers Protest Effect : భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన నిరసన ఆందోళనకు దారి తీసింది. ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టడంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పెట్రోలు కొరత ఏర్పడుతుందనే భయంతో జనం భారీ ఎత్తున పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టారు.

ట్రక్కు డ్రైవర్ల నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్‌లు
కొత్త హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎటు చూసినా భారీ ట్రాఫిక్ జామ్‌లు.. పెట్రోలు బంకుల వద్ద పొడవైన క్యూలు దర్శనం ఇస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని సిటీల్లో అంబులెన్స్‌లు సైతం గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో పేషేంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌లోనూ పెట్రోల్ బంకులు కిటకిట
దేశ వ్యాప్తంగా హైవేలు, ప్రధాన రహదారులను దిగ్బంధించి డ్రైవర్లు నిరసన ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురిలో ట్రక్కు డ్రైవర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై డ్రైవర్లు రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనల ప్రభావం ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, జమ్నూకశ్మీర్, డీల్లి, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో కనిపించింది. ఇటు హైదరాబాద్‌లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపించంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో బంకుల వద్ద జనం బారులు తీరారు. స్టాక్ లేదంటూ బంకు సిబ్బంది జనాన్ని వెనక్కి పంపుతున్నారు.

Also Read : బతుకుతెరువు కోసం రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ప్రొఫెసర్.. అంత కష్టం ఎందుకొచ్చిందంటే?

న్యాయ సంహితలో ఏముంది?
కొత్త భారతీయ న్యాయ సంహితలోని హిట్ అండ్ రన్ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాద కేసుల్లో శిక్షను 10 సంవత్సరాలకు పెంచారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోయినట్లైతే గరిష్టంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ప్రమాదాన్ని నివేదించకుండా నేరస్తుడు తప్పించుకున్నట్లయితే రూ.7 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష పదేళ్లు పొడిగించబడుతుంది. కొత్త చట్టం చాలా కఠినంగా ఉందని.. పెద్ద వాహనాలు నడిపే డ్రైవర్లపట్ల పక్షపాతంతో ఉందని ట్రక్ డ్రైవర్లు నిరసనలు చేపట్టారు.