Manipur horror: భయంతో మణిపూర్ వదిలేసి వెళ్తున్న మెయితీ తెగ ప్రజలు.. ఇప్పుడు ఏం జరుగుతోందంటే?
దీంతో గత రాత్రి 41 మంది మెయితీలు అసోంలోని సిల్చార్‌కు చేరుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Manipur Violence
Manipur horror – Meitei: మణిపూర్‌లో ఇటీవల ఇద్దరు కుకీ (Kuki) తెగకు చెందిన మహిళలను హింసించి, నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రావడంతో మెయితీ తెగకు చెందిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న మెయితీ తెగకు చెందిన వారు కొందరు మణిపూర్ వదిలి అసోం వెళ్తున్నారు.
తాజాగా, 41 మంది మెయితీ తెగకు చెందిన వారు అసోం వెళ్లిపోయారు. మెయితీ తెగకు చెందిన కొందరు మే 4న కుకీ తెగవారి కోసం వెతుకుతూ ఓ గ్రామంపై దాడికి వెళ్లి, ఆ సమయంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంతో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
మాజీ మిలిటెంట్ల సంస్థ సూచనతో..
మిజోరంలోని ఓ మాజీ మిలిటెంట్ల సంస్థ తాజాగా మెయితీలకు ఓ సూచన చేసింది. మెయితీలు అందరూ వారి రక్షణ కోసం మణిపూర్ వదిలి వెళ్లాలని చెప్పింది. మిజో యూత్ ఆగ్రహావేశాలతో ఉందని తెలిపింది. దీంతో గత రాత్రి 41 మంది మెయితీలు అసోంలోని సిల్చార్‌కు చేరుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
వారందరూ సొంత వాహనాల్లో వచ్చారని చెప్పారు. ప్రస్తుతం మిజోరంలో ఎటువంటి దాడులూ జరగడం లేదని తెలిపారు. వారికి మిజోరం ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని అన్నారు. అయినప్పటికీ వారు మణిపూర్ ను వదిలి వచ్చారని వివరించారు. మణిపూర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు అసోంలోనే ఉంటామని చెబుతున్నారని అన్నారు.
అసోం పోలీసులు వీరికి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. మే 3 నుంచి మణిపూర్ లో ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మెయితీ, కుకీ తెగలకు చెందిన వారు వేలాది మంది అసోంకు వచ్చి ఉంటున్నారని చెప్పారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలు బయటకు వచ్చాక మెయితీ వర్గంలో భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో వారికి భద్రత కల్పిస్తామని మణిపూర్ ప్రభుత్వం శనివారం భరోసా ఇచ్చింది.
Manipur : నా కుటుంబం భవిష్యత్తు తెలియడం లేదు.. మొదటిసారి మీడియా ముందుకు మణిపూర్ బాధితురాలి తల్లి