Phani cyclone Alert : దూసుకొస్తున్న ఫోని

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 12:42 AM IST
Phani cyclone  Alert : దూసుకొస్తున్న ఫోని

Updated On : April 29, 2019 / 12:42 AM IST

నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ప్రకారం ‘ఫణి’ అని నామకరణం చేశారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం తీవ్ర తుఫానుగా మారి..ఏప్రిల్ 29వ తేదీ సోమవారం అతి తీవ్ర తుఫానుగా బలపడనుంది. 

ఫోని తుఫాన్ తీరంవైపుగా దూసుకొస్తోంది. తీరంపై విరుచుకుపడేందుకు వాయు వేగంతో పరుగులు తీస్తోంది. ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండగా.. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమమయ్యింది. గంటకు 10 కిమీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది.

ఇది దిశ మార్చుకుని తూర్పు ఈశాన్య దిశగా పయనించి మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫోని తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 140 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో.. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం, ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం తమిళనాడు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి.