ఇది పద్దతి కాదు…కేజ్రీవాల్ పై మోడీ ఆగ్రహం

దేశంలో కొవిడ్ ఉద్ధృతిపై తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.

ఇది పద్దతి కాదు…కేజ్రీవాల్ పై మోడీ ఆగ్రహం

Modi

Updated On : April 23, 2021 / 4:45 PM IST

modi దేశంలో కొవిడ్ ఉద్ధృతిపై తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మోడీ. కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కేంద్ర సహకారం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంపై సమావేశంలో చర్చించారు.

అయితే, ఈ సమావేశం సంద‌ర్భంగా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పీఎంతో సీఎంల స‌మావేశం సంద‌ర్భంగా దానిని కేజ్రీవాల్ కార్యాలయం లైవ్ టెలికాస్ట్ చేయ‌డమే దీనికి కార‌ణం. క‌రోనాను ఎదుర్కోవ‌డానికి ఓ నేష‌న‌ల్ ప్లాన్ ఉండాల్సిన అవ‌స‌రం ఉందని..అప్పుడు కేంద్రం,రాష్ట్రాలు ఆ దిశగా కలిసిపనిచేస్తాయని మాట్లాడుతున్న కేజ్రీవాల్‌ను మ‌ధ్య‌లో ఆపిన మోడీ…ఏం జరుగుతోంది. ఇది మన సాంప్రదాయానికి విరుద్దం. ప‌ద్ధ‌తి కాదు. పీఎంతో జ‌రుగుతున్న ఇన్‌హౌస్ మీటింగ్‌ను ఓ సీఎం లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంది. ఇది ప‌ద్ధ‌తి కాదు. మనం ఎల్లప్పుడూ నిగ్రహం పాటించాలి అని ప్రధాని అన్నారు. అయినా కూడా కేజ్రీవాల్ మాత్రం మోడీ చెప్పిన విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా తాను చెప్పాల్సింది చెబుతూ వెళ్లారు. ఏదైనా త‌ప్పు మాట్లాడితే క్ష‌మించాల‌ని అన్నారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామని మోడీకి రిప్లై ఇచ్చారు.

అయితే, ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన కోవిడ్ సమీక్షా సమావేశాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వేదికగా చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. ‘కేజ్రీవాల్ చాలా తక్కువ స్థాయికి జారిపోయారు. ముఖ్యమంత్రులతో ప్రధాని ప్రైవేటు సంభాషణను ఆయన బయటకు వెల్లడించారు. ఆయన ప్రసంగం మొత్తం ఏమాత్రం పరిష్కారం చూపించలేదు. రాజకీయాలు చేస్తూ, బాధ్యతను విస్మరించారని కేజ్రీవాల్ ప్రసంగంపై విమర్శలు గుప్పించాయి.

ఇక, ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వివరణ ఇచ్చింది. ప్రధానితో సమావేశం ప్రసారం చేయరాదని లిఖితపూర్వకంగా కానీ, మౌఖికం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు లేనందున సీఎం ప్రసంగాన్ని లైవ్‌లో షేర్ చేశామని తెలిపింది. ప్రజాప్రాధాన్యత గల అంశాల విషయంలో ఎలాంటి దాపరికాలు ఉండవని, అలాంటి ప్రజాప్రాధాన్యం కలిగిన విషయాలను గతంలోనూ లైఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయని సీఎంఓ వివరణ ఇచ్చింది. లైవ్ ప్రసారం వల్ల ఎవరికైనా ఒకవేళ అసౌకర్యం కలిగినట్లయితే ఇందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని కూడా సీఎంఓ ఆ ప్రకటనలో పేర్కొంది.