మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన మోదీ.. దీని ఫీచర్లు అదరహో.. హాయిగా ప్రయాణించొచ్చు..
భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది.
PM Modi Flags Off India’s First Vande Bharat Sleeper Train (Image Credit To Original Source)
- మాల్దా నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించిన మోదీ
- భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం
- సుదీర్ఘ రైలు ప్రయాణాలు చేసే వారికి మెరుగైన సౌకర్యాలు
Vande Bharat Sleeper Trains: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది. అలాగే, అదే సమయంలో గువాహటి-హౌరా వందే భారత్ స్లీపర్ రైలును మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో రెండు దిశలా సేవలు ప్రారంభమైనట్లే.
భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం. సుదీర్ఘ రైలు ప్రయాణాలు చేసే వారికి మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొచ్చారు.
ఇవాళ ప్రారంభించిన రైలు కోల్‌కతా సమీపంలోని హౌరా నుంచి గువాహటిలోని కామాఖ్య జంక్షన్ వరకు రాకపోకలు కొనసాగిస్తుంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు రాత్రిపూట ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది.
దేశంలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా పూర్తిగా ఏసీ సౌకర్యంతో వందే భారత్ స్లీపర్ రైలును అభివృద్ధి చేశారు. విమానంలో ప్రయాణిస్తున్నామన్న అనుభూతిని కలిగించేలా ఈ రైలు రూపుదిద్దుకుంది. సుదీర్ఘ ప్రయాణాలు మరింత వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనున్నాయి. హౌరా-గువాహటి కామాఖ్య మార్గంలో ప్రయాణ సమయం సుమారు 2.5 గంటలు తగ్గుతుంది. దీని వల్ల పర్యాటక రంగానికి పెద్ద ఊతం వస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు
వేగం: గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలును రూపొందించారు. సాధారణ సర్వీసులో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది.
సౌకర్యాలు: ప్రయాణికుల శరీర నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని, వాటికి అనుగుణంగా బెర్తులను రూపొందించారు. ప్రపంచ స్థాయి సస్పెన్షన్ వ్యవస్థను వాడారు. సస్పెన్షన్ వ్యవస్థ అంటే రైలు బోగీలకు అమర్చే సిస్టమ్.
ఇది పట్టాలపై రైలు నడుస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్, జెర్క్ (కుదుపులు)లను తగ్గిస్తుంది. బోగీకి స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రయాణ సమయంలో శరీరానికి తక్కువ ఒత్తిడి కలిగేలా చేస్తుంది. రైలు ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా మారేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
శుభ్రత: 99 శాతం సూక్ష్మజీవులను నశింపజేసే ఆధునిక డిస్ఇన్ఫెక్టెంట్ సాంకేతికతను వినియోగించారు. ప్రతి ప్రయాణికుడికి కొత్త బెడ్ లినెన్లు, తువాళ్లు అందిస్తారు.
భద్రత: దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థను అమలు చేశారు. రైలు అంతటా పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కవచ్ అంటే రైళ్లు ఢీకొనకుండా ప్రమాదాలను నివారించే స్వదేశీ ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థ.
ఆటోమేషన్: ఆటోమేటిక్ స్లైడింగ్ తలుపులు ఉంటాయి. స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి.
రైల్లో స్థానిక భోజనం: వేగం, శుభ్రత, భద్రతతో పాటు ప్రయాణికులకు స్థానిక వంటకాలు అందిస్తారు. ప్రీమియం విమాన సేవల తరహాలో క్యాటరింగ్ సౌకర్యం టికెట్ ధరలోనే ఉంటుంది. స్థానిక రుచులకు ప్రాధాన్యం ఇస్తారు. కామాఖ్య నుంచి హౌరా వెళ్లే ప్రయాణికులకు అస్సామీ వంటకాలు అందిస్తారు. హౌరా నుంచి కామాఖ్య ప్రయాణించే వారికి బెంగాలీ వంటకాలు వడ్డిస్తారు.
Guwahati (Kamakhya) 🔁 Howrah
🚄 First Vande Bharat Sleeper…
On track with PM @narendramodi Ji’s Purvodaya vision. pic.twitter.com/0xmJDjveVp— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 17, 2026
