సర్దార్ సరోవర్ డ్యాం.. మోడీ స్పెషల్ బర్త్‌డే సెలబ్రేషన్స్

ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ సమీపంలో నివసించే తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకునేందుకు మోడీ వచ్చే అవకాశం ఉంది. వడోదరకు సమీపంలోని కెవాడియా ప్రాంతంలో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రత్యేక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే గుజరాత్ బీజేపీ పార్టీ కార్యవర్గం మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది.
నర్మదా ప్రాజెక్టు విషయంలో హామీ ఇచ్చినట్టుగానే ప్రాజెక్టు పూర్తి చేసినందుకు మోడీకి కృతజ్ఞతగా పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నర్మేద్ సర్వేడ్ అనే కార్యక్రమం పేరుతో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 17న డ్యాం దగ్గర పూజలు చేసేందుకు మోడీ గుజరాత్ రానున్నారని రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. మోడీ పర్యటించే రోజుకు డ్యామ్ లో నీటిమట్టం స్థాయి గరిష్టంగా 138.68 మీటర్ల ఎత్తునకు చేరుకోనుంది.
సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో వర్షపాతం బాగుందని, సరోవర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సమీప ప్రాంతాలకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో పడిన వర్షాలతో వచ్చే రెండేళ్ల వరకు నీటిపారుదల, తాగునీటికి ఎలాంటి కొరత లేదన్నారు. రాష్రవ్యాప్తంగా జలవనరుల శాఖల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.