సౌర విద్యుత్​కు భారత్ అతిపెద్ద మార్కెట్…ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 03:20 PM IST
సౌర విద్యుత్​కు భారత్ అతిపెద్ద మార్కెట్…ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ

Updated On : July 10, 2020 / 4:06 PM IST

సౌర విద్యుత్​కు భారత్​ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్​ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి భారత్ అతిపెద్ద మార్కెట్ అని ప్రధాని తెలిపారు

మధ్యప్రదేశ్​లోని రేవాలో ఏర్పాటైన ఆసియాలోనే అతిపెద్దది అయిన 750 మెగా వాట్ల సౌర విద్యుత్ పార్క్​ను శుక్రవారం(జులై-10,2020) ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని.. సోలార్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. రేవా అల్ట్రా మెగా సోలార్​ లిమిటెడ్​ (ఆర్​యూఎంఎస్​ఎల్​), మధ్యప్రదేశ్​ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్​, భారత సోలార్​ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పార్క్​ను నిర్మించాయి.

సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భారత్​కు ఉన్న అనుకూలతలను మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. అతిపెద్ద ప్లాంట్ నిర్మాణంతో భారత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. శుద్ధమైన విద్యుత్​కు అత్యంత ఆకర్షణీయ మార్కెట్ భారతేనని వెల్లడించారు. రేవాలోని సౌర విద్యుత్ ప్లాంట్‌తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కూడా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రధాని తెలిపారు. రాబోయే రోజుల్లో సౌరశక్తే ప్రధాన విద్యుత్ వనరుగా ఉంటుందని ఆయన చెప్పారు.

21వ శతాబ్దంలో ప్రధాన విద్యుత్ వనరు సౌరశక్తి. ఎందుకంటే ఇది నిశ్చితమైనది. నాణ్యమైనది. సురక్షితమైనది. రేవా ప్లాంట్‌తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రోకు కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. మధ్యప్రదేశ్​లోని నీముచ్, ఛత్తర్​పుర్, ఉత్తర్​ప్రదేశ్​లోని షాజాపూర్​ల్లో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉందని మోడీ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 22 డిసెంబర్ 2017న ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ప్లాంట్ పూర్తయింది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్. దీని సామర్థ్యం 750 మెగా వాట్లు. ఇందులో మూడు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. రెవా ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76 శాతం మధ్యప్రదేశ్ విద్యుత్ నిర్వహణ సంస్థకు, 24% ఢిల్లీ మెట్రోకు అందిస్తారు.