Modi Cabinet: మారుమూల గ్రామాల్లోకి 4జీ నెట్‌వర్క్‌.. మోదీ కేబినెట్ కీలక నిర్ణయం

మోదీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగం, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేంద్రం.

Modi Cabinet: మారుమూల గ్రామాల్లోకి 4జీ నెట్‌వర్క్‌.. మోదీ కేబినెట్ కీలక నిర్ణయం

4g Network

Updated On : November 18, 2021 / 10:53 AM IST

PM Modi Led Cabinet: మోదీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగం, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేంద్రం. ఐదు రాష్ట్రాల్లోని 7వేలకు పైగా గ్రామాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చేలా టవర్లను అనుసంధానం చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో 44 జిల్లాల్లోని 7వేల 287 గ్రామాలకు 4జీ నెట్‌వర్క్‌ను అందించబోతున్నామని, ఇందుకోసం 6వేల 466 కోట్ల రూపాయలతో టవర్లను అనుసంధానం చేయనున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌కు యూఎస్‌వోఎఫ్‌ నిధులు సమకూర్చనుంది. బిడ్డింగ్‌ ద్వారా ఈ ప్రాజెక్టును అర్హత ఉన్న కంపెనీలకు అప్పగించనున్నారు. మొదలు పెట్టిన 18 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.

ప్రధాన్‌ మంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న రోడ్లు, వంతెనలను పూర్తి చేసేందుకు గడువును పొడిగించారు.

2024-25నాటికి నిర్మాణాలు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 33వేల 822 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో కేంద్రం 22వేల 978కోట్ల రూపాయలను కేటాయించనుంది.