కరోనా ప్రమాదం ఇంకా ఉంది….మోడీ

Pm Modi:తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మంగళవారం(అక్టోబర్-13,2020)ప్రధాని మోడీ తెలిపారు. రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈ నూతన చట్టాలు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం… రైతుల ఆదాయం పెంచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ బాలాసాహెబ్ వీఖే పాటిల్ ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్న మోడీ…అహ్మద్ నగర్ జిల్లాలోని ‘ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరును డా. బాలాసాహెబ్ వీఖే పాటిల్ ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీగా మార్పు చేశారు. పాటిల్ ఆత్మకథ ఇప్పుడు విడుదలైనప్పటికీ.. ఆయన గురించి మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు మోడీ. మహారాష్ట్ర అభివృద్ధికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని కీర్తించారు.
సమాజంలో అర్ధవంతమైన మార్పు కోసం రాజకీయాలను ఓ మాధ్యమంగా ఎలా మార్చాలి, గ్రామీణులు, పేదల సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయాలను ఆయన ఎప్పుడో నొక్కిచెప్పారు. ఇదే ఆయనను ఇతరుల నుంచి భిన్నంగా ఉండేలా చేసిందని మోడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, అహ్మద్‌నగర్ ఎంపీ డా. సుజయ్ వీఖే పాటిల్, ప్రవర మెడికల్ ట్రస్ట్, ప్రవర షుగర్ ఫ్యాక్టరీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ప్రజలకు మోడీ ముఖ్యమైన సూచనలు చేశారు. కరోనా ప్రమాదం ఇప్పటికీ ఉందని మోడీ అన్నారు. మహారాష్ట్రలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందన్నారు. మాస్కులు ధరించి, వ్యక్తిగత దూరం పాటించడంలో అలసత్వం ఉండకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరులో తప్పక విజయం సాధిస్తామన్నారు.