“దీదీ”గా కాదు మేనల్లుడి ఆంటీగా మమత.. టీఎంసీ “ఖేల్” ఖతం : మోడీ

west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్‌కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్ పరేడ్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బెంగాల్‌కు శాంతి, బంగారు, ప్రగతిశీల భవిష్యత్తు కావాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సువర్ణ బంగాల్ కల నెరవేరబోతోందన్నారు. బెంగాల్ అభివృద్ధి, పెట్టుబడుల పెంపు, బెంగాల్ సంస్కృతి పరిరక్షణ, మార్పు తీసుకొస్తానని తాను హామీ ఇస్తున్నానని మోడీ అన్నారు.
రాబోయే 25 సంవత్సరాలు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని..వచ్చే 5 సంవత్సరాలలో ఇక్కడ అభివృద్ధి రాబోయే 25 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందని మోడీ అన్నారు. వెస్ట్ బెంగాల్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైందని.. ఈ వ్యవస్థను బీజేపీ బలోపేతం చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై, పోలీసులలో మరియు పరిపాలనలో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందటానికి తాము మార్పును తీసుకువస్తామన్నారు. 2047 లో, భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకునేటప్పుడు, బెంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుందని మోడీ అన్నారు.
‘మా, మాతి, మనుష్’ కోసం పనిచేస్తామ మమత హామీ ఇచ్చిందని.. కానీ గత పదేళ్లలో టిఎంసి ఇక్కడి సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగిందా?అని మోడీ ప్రశ్నించారు. మార్పు కోసం బెంగాల్ ప్రజలు తమ ఆశలను ఎప్పుడూ వదులుకోలేదని ప్రధాని అన్నారు. మా, మనుష్, మాతి’ పరిస్థితి అందరికీ బాగా తెలుసన్నారు. వీధుల్లో మరియు ఇళ్లలోని తల్లుల టీఎంసీ వర్కర్లు దాడి చేస్తున్నారన్నారు. ఇటీవల, 80 ఏళ్ల తల్లిపై టీఎంసీ వర్కర్లు ప్రదర్శించిన క్రూరత్వం దేశం మొత్తానికి వారి క్రూరమైన ముఖాన్ని చూపించిందన్నారు.
బెంగాల్ ప్రజలు మమతని ‘దీదీ’ గా ఎన్నుకున్నారు, కానీ మేనల్లుడికి అత్తగానే ఆమె మిగిలిపోయిందన్నారు. బెంగాల్ ప్రజలు మమత నుండి ఈ ఒక్క ప్రశ్న మాత్రమే అడుగుతున్నారు అని మోడీ అన్నారు. మమత తనకు చాలా కాలంగా తెలుసని..వామపక్షాలకు వ్యతిరేకంగా గళం విప్పిన వ్యక్తి ఆమెలో ఇప్పుడు లేరని మోడీ అన్నారు. ఇప్పుడామె వేరొకరి భాష మాట్లాడుతున్నారని, వారే ఆమెను నియంత్రిస్తున్నారని ప్రధాని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్‌తో పాటు బంగాల్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఒకవైపు,బంగాల్ ప్రజలు మరోవైపు ఉన్నారని అన్నారు. టీఎంసీ ఖేల్(ఆట)ఖతం అయిందని,వికాస్ షురూ అయిందని మోడీ అన్నారు. ఓటర్లు భయపడకుండ మమత సర్కార్ కి వ్యతిరేకంగా బీజేపీకి ఓటువేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇక, మోడీ ప్రసంగానికి కొద్ది సేపటి క్రితం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ర్యాలీ వేదికగా ప్రముఖ బాలీవుడు నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. బెంగాల్ బీజేపీ నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. 2014లో టీఎంసీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మిథున్ చక్రవర్తి.. 2016 డిసెంబర్లో రాజీనామా చేశారు. శనివారం బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తరఫున బంగాల్ ఎన్నికల పరిశీలకులు కైలాశ్ విజయ్ వర్గీయ.. మిథున్ చక్రవర్తిని కలిశారు. ఆదివారం కైలాష్ వర్గీయ,బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో సమక్షంలో మిధున్ చక్రవర్తి కాషాయకండువా కప్పుకున్నారు.
ఇక,294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మార్చి-27న మొదటి దశ,ఏప్రిల్-1న రెండో దశ,ఏప్రిల్-6న మూడో దశ,ఏప్రిల్-10న నాల్గవ దశ,ఏప్రిల్-17న ఐదవ దశ,ఏప్రిల్-22న ఆరవ దశ,ఏప్రిల్-26న ఏడవ దశ,ఏప్రిల్-29న ఎనిమిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే-30న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది.