మోడీ కలిసి పనిచేద్దామన్నారు.. రాష్ట్రపతి పదవి ఇస్తాననలేదు: శరద్ పవార్

మోడీ కలిసి పనిచేద్దామన్నారు.. రాష్ట్రపతి పదవి ఇస్తాననలేదు: శరద్ పవార్

Updated On : December 3, 2019 / 2:42 AM IST

నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ తనతో కలసి పనిచేద్దామని ప్రధానే తనను కోరినట్లు అన్నారు. రాష్ట్రపతి పదవి ఇస్తాననడంలో ఎటువంటి వాస్తవం లేదని కొట్టేపారేశారు. సోమవారం ఓ మరాఠీ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవంబరు నెలలో ప్రధాని మోడీతో భేటీ, అనంతర రాజకీయ పరిణామాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. 

‘కలిసి పనిచేద్దామంటూ మోడీ నన్ను అడిగారు. మన మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. వాటిని అలాగే కొనసాగనివ్వండి. కలిసి పనిచేయడం మాత్రం కుదరదు అని ప్రధానికి తెలిపా’ అన్నారు. ఆ భేటీలో తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారనడంపై.. ‘అలాంటిదేమీ లేదు. కానీ, నా కుమార్తె సుప్రియా సూలేకు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తామని మాట ఇచ్చారు’అని పవార్‌ వివరించారు. 

 

అజిత్ పవార్ కు క్యాబినెట్ లో ఉద్దవ్ ఠాక్రే స్థానం కల్పించకపోవడంపై స్పందిస్తూ.. దేవేంద్ర ఫడ్నవీస్‌తో అనూహ్యంగా చేతులు కలపడమే కారణమన్నారు. ‘అజిత్‌ ప్లేటు ఫిరాయించిన విషయం తెలియగానే మొట్టమొదటగా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేశా. అజిత్‌ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని చెప్పారు. 

 

‘అజిత్‌కు ఎన్సీపీ మద్దతు లేదని తెలియగానే అతడి వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వెంటనే వచ్చేశారు’అని వివరించారు. ‘ఫడ్నవీస్‌‌ను వీడి రావాలంటూ నా కుటుంబ సభ్యులు అజిత్‌ను కోరిన విషయం నాకు తెలియదు. అజిత్‌ చేసింది తప్పని అంతా భావించారు’ అని తెలిపారు. ‘నువ్వు క్షమించరాని పని చేశావు. దీనికి ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నువ్వు అందుకు మినహాయింపు కాదు’ అని అజిత్‌కు చెప్పానన్నారు.