రాజకీయాల కోసం కేసులు.. CJI ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.

రాజకీయాల కోసం కేసులు.. CJI ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

Cji (2)

Updated On : August 26, 2021 / 4:46 PM IST

CJI : అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధిస్తున్నారన్నారు. కేసుల నమోదులో పోలీసు శాఖ బాధ్యత వహించాలని.. వారి తీరు ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని ఎన్వీ రమణ తెలిపారు. మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పోలీసులపై చర్యలు తీసుకోవడం వంటి సంప్రదాయానికి తెర పడాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా, ఈ ఏడాది జులైలో సస్పెండైన IPS అధికారి గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌పై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం దేశద్రోహం, తదితర కేసులు నమోదు చేసింది. గుర్జిందర్‌ పాల్‌ సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB), ఆర్థిక నేరాల విభాగం(EOW) ఆయనపై జూన్ 29న కేసు నమోదు చేసింది. గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ నివాసంలో జూలై 1న సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత.. ఆయనపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్,రాజద్రోహం కేసుని కొట్టేయాలని కోరుతూ గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు దీనికి నిరాకరించడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌.

తనపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ గుర్జిందర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-26,2021) విచారణ చేపట్టింది. సింగ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారిమన్, ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.  ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ…దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయనీ.. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదవుతున్నాయన్నారు. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారని.. కొందరు పోలీసు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టే ధోరణి అని.. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందన్నారు.

గుర్జిందర్ పాల్ సింగ్‌‌ పిటిషన్‌ వ్యహారంలో ఛత్తీస్‌ గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసులపై నాలుగు వారాల్లో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని.. అప్పటివరకు గుర్జిందర్ పాల్ సింగ్‌ ని అరెస్టు చేయరాదని ఆదేశించింది. పోలీసుల విచారణకు గుర్జిందర్ సహకరించాలని పేర్కొంది.