మహా సీఎం ఫడ్నవీస్ కు సుప్రీం షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2019 / 07:07 AM IST
మహా సీఎం ఫడ్నవీస్ కు సుప్రీం షాక్

Updated On : October 1, 2019 / 7:07 AM IST

మ‌హారాష్ట్ర సీఎంకు సుప్రీం కోర్టు జ‌ల‌క్ ఇచ్చింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో క్రిమిన‌ల్ కేసుల‌ గురించి వెల్ల‌డించ‌ని కేసులో విచార‌ణ చేప‌ట్టాల్సిందే అని సుప్రీం తెలిపింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజ‌న్ గ‌గోయ్‌తో పాటు జ‌స్టిస్ దీప‌క్ గుప్తా, జ‌స్టిస్ అనిరుధ్ బోస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీం తిర‌స్క‌రించింది.

ఫ‌డ్న‌వీస్‌పై ప‌లు క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటి గురించి ఆయన తన ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొనలేద‌ని మ‌హారాష్ట్ర‌కు చెందిన స‌తీశ్ ఊకే కోర్టులో కేసు చేశారు. ఆ కేసులను రిప్ర‌జెంటేష‌న్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోని సెక్ష‌న్ 125 ప్ర‌కారం విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ సుప్రీం ఆదేశించింది. కొత్త‌గా ఫిర్యాదును స్వీక‌రించాల‌ని ట్ర‌య‌ల్ కోర్టును కూడా ఆదేశించింది. 

మరికొన్ని రోజుల్లో మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా మ‌రోసారి ఫ‌డ్నవీస్ పోటీ చేయ‌నున్నారు. అయితే సుప్రీం తీర్పుతో ఫ‌డ్న‌వీస్ భ‌విష్య‌త్తు ఆగ‌మ్యగోచ‌రంగా మారింది