PK-Pawar Meeting : పవార్ తో మరోసారి పీకే భేటీ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం మరోసారి సమావేశమయ్యారు.

Pk Pawar
PK-Pawar Meeting ఎన్సీపీ అధినేత శరద్ పవార్-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ ఉదయం పవార్ నివాసానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్… గంటపాటు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా, గత రెండు వారాల్లో వీరిద్దరూ భేటీ అవడం ఇది మూడోసారి. అంతేకాకుండా..8 ప్రతిపక్ష నేతలు పవార్ ఇంట్లో సమావేశం అయిన తర్వాత రోజే పీకే.. పవార్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి థర్డ్ ఫ్రంట్‌గా ఏకీకరణ చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు వార్తలు వస్తున్నప్పటికీ అది నిజం కాదన్న వాదన కూడా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్‌ను బరిలోకి దింపడమే ఈ సమావేశం లక్ష్యమని తెలుస్తోంది. థర్డ్‌ఫ్రంట్ ఎన్డీయేకు పోటీ ఇవ్వలేవన్న ప్రశాంత్ కిశోర్ ఇటీవల వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
ప్రశాంత్ కిషోర్ ఈ నెల 11న తొలిసారి శరద్‌పవార్‌ను ముంబైలో కలిశారు. ఆ తర్వాత సోమవారం(జూన్-21,2021) వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీ జరిగిన తర్వాతి రోజు మంగళవారం దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశమై సమాలోచనలు జరిపారు. దీంతో మిషన్ 2024 లక్ష్యంగా తృతీయ కూటమికి అడుగులు పడుతున్నాయని ప్రచారం సాగింది. అయితే ఇది థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం జరిగిన సమావేశం కాదని, కేవలం దేశ రాజకీయ వాతావరణాన్ని తెలుసుకోవడానికి, ఆలోచనలను పంచుకోవడానికి కలిసినట్లు భేటీలో పాల్గొన్న నేతలు తెలిపారు.