అమిత్ షా V/S ప్రశాంత్ కిషోర్….ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ నొక్కండిలా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ ను కోపంతో నొక్కాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా నెలరోజులుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు తమ పిల్లలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆగ్రహానికి సింబల్‌గా షహీన్ బాగ్ నిలిచింది. ఈ సమయంలో ఆదివారం(జనవరి-26,2020)ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా షహీన్‌బాగ్ నిరసనలపై విరుచుకుపడ్డారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఢిల్లీతో పాటు దేశాన్ని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చన్నారు. తద్వారా షహీన్‌బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని తెలిపారు.
షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను అంతే ఆగ్రహంతో ఈవీఎం బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించాలని ఓటర్లను కోరారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎం బటన్‌లను కేవలం ప్రేమతో నొక్కండి. చిన్న డోసులతో పెద్ద షాక్‌లు ఇవ్వచ్చు. అందువల్ల సౌభ్రాతృత్వం, స్నేహానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదుని షా వ్యాఖ్యలపై ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు షహీన్‌బాగ్ ఘటనలను అమిత్‌షా విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తప్పుపట్టారు. శాంతియుత నిరసనలను కాదంటే మహాత్మాగాంధీ చెప్పిన అహింసావాదాన్ని తోసిపుచ్చడమేనని అంటున్నారు.
ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన్న కమలం పార్టీ 40మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. 2015నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ హవా ఉన్నప్పటికీ కేవలం 3సీట్లు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.