PM Modi : పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై తొలిసారి స్పందించిన మోదీ.. మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికపై ఏమన్నారంటే?
మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారు కాదు.. చాలాకాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi
Parliament Security Breach : పార్లమెంట్ లోపల, పరిసర ప్రాంతాల్లో పొగగొట్టాలతో నలుగురు నిరసనకారులు ఇటీవల కలకలం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్లమెంట్ లోపలికి దూసుకు రావడంతోపాటు పార్లమెంట్ ఆవరణంలో హల్ చల్ సృష్టించారు. ఈ ఘటన పార్లమెంట్ భద్రతా వైపల్యాన్ని ఎత్తిచూపింది. అయితే, ఈ ఘటనకు కారణమైన వారిని భద్రతా సిబ్బంది అందుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ అంశంపై మాట్లాడారు.
Also Read : CM Revanth Reddy: రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏఏ విషయాలపై చర్చించారంటే
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమని, దానిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదని మోదీ అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేయొద్దని మోదీ కోరారు. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దర్యాప్తు పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని మోదీ చెప్పారు.
Also Read : IND vs SA 1st ODI Match : అయ్యో రింకూ.. వన్డేల్లో అరంగేట్రంకు దక్కని అవకాశం.. సంజూ వైపు మొగ్గు
ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం మినహా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ కొత్తవారిని సీఎం అభ్యర్థులుగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయంపై మోదీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో సీఎంలు కొత్తవారని అందరూ అనుకుంటున్నారు.. కానీ, వారంతా కొత్తవాళ్లు కాదు.. ఎంతోకాలంగా ప్రజల కోసం కష్టపడ్డారు. రాజకీయంగా, ప్రజా సమస్యల పరిష్కారంలో వారికి ఎంతో అనుభవం ఉంది. చాలాకాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదని మోదీ అన్నారు.