వాళ్లు చూపించినట్లు కాదు.. రాహుల్ చాలా డిఫరెంట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2019 / 10:22 AM IST
వాళ్లు చూపించినట్లు కాదు.. రాహుల్ చాలా డిఫరెంట్

గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు  రాహుల్‌ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019)కేరళలోని వయనాడ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొన్నారు.వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
వయనాడ్ ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ…ఈరోజు నేను మీ ముందు ఒక చెల్లెలుగా నిలబడ్డాను.నేను పుట్టినప్పటినుంచి నాకు తెలిసిన వ్యక్తి తరపున నేను మీ ముందున్నాను.ఈ ఎన్నికల్లో మీ అభ్యర్థి రాహుల్ గాంధీ.గడిచిన పదేళ్లుగా రాహుల్  తన ప్రత్యర్థుల నుంచి వ్యక్తిగత దాడులు ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులు రాహుల్‌ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమని ప్రియాంక అన్నారు. అమరుడైన తమ తండ్రిని ఓ దొంగ అని బీజేపీ నేతలు సంబోధించారన్నారు. అయినా అన్నింటిని తట్టుకొని మీ కోసం పనిచేయాలన్న సంకల్పంతో మీ ముందు నిలబడ్డారని రాహుల్‌ గాంధీ గురించి ప్రియాంక వివరించారు.

గడిచిన ఐదేళ్లలో దేశాన్ని బీజేపీ ప్రభుత్వం ముక్కలు చేసిందని ప్రియాంక ఆరోపించారు. ప్రతి రాష్ట్రం దేశంలో భాగమేనని ఆమె అన్నారు .వివిధ మతాలు, సంస్కృతుల సమ్మేళనమే మన దేశం అని ఆమె అన్నారు. ఈ ఐదేళ్లలో బీజేపీ చేసిందేందంటే…ప్రజల్లో  విభజన తీసుకురావటమేనని ప్రియాంక అన్నారు.2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక బీజేపీ మర్చిపోయిందన్నారు.

రైతుల  ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ.15లక్షలు జమచేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి రాగానే అవేవీ వారికి గుర్తుకురాలేదని ప్రియాంక విమర్శించారు. అలాగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కేరళ ప్రాంతం అంటే అమితమైన గౌరవం ఉండేదన్నారు. ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ఆమె ఎంతో విలువ ఇచ్చేవారని ప్రియాంక గుర్తుచేశారు.