ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రియాంక : సునామీలా ఫాలోవర్స్

ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఈస్ట్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ ఆదివారం రాత్రి సోషల్ మీడియా లో తన అధికారిక ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఖాతా తెరిచిన కొద్ది నిమిషాల్లోనే 22 వేల మంది ఫాలోయర్లు ఆమె ఖాతాలో చేరారు. ఈ సంఖ్య సోమవారం మధ్యాహ్నానికి42 వేలకి పైగా చేరింది. ఈ ఖాతాను ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రియాంక ప్రారంభించగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విట్టర్ గుర్తించింది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి పెద్ద దిక్కుగా ఉన్న సోమవారం ఆమె తొలిసారిగా లక్నోలో పర్యటిస్తున్నారు. లక్నో పర్యటనకు ముందు ఆమె ట్విట్టర్ తెరిచినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ట్వీట్ లు చేయలేదు. ప్రియాంకను ట్విట్టర్ లో ఫాలో కావచ్చని కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ లో పోస్టు చేశారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న ఈరోజుల్లో కొత్తగా పలువురు నేతలు ఖాతాలను తెరుస్తున్నారు. గత నెలలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ట్విట్టర్ ఖాతా తెరిచారు.