మోడీ మన్ కీ బాత్…ప్లేట్లు,డబ్బాలు మోగించి రైతుల నిరసన

Protesting farmers beat thaalis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు అన్నదాతులు. ఇవాళ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా సింఘా,ఘాజిపూర్ బోర్డర్స్ లో పెద్ద ఎత్తున రైతులు…పాత్రలు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేడియోలో ప్రధాని ప్రసంగం కొనసాగినంతసేపు ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు.
వ్యవసాయ బిల్లులపై రైతుల నిరసన నేపథ్యంలో గత ఆదివారం స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాద..వ్ ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలపాలని రైతులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగం మొదలు కాగానే రైతులు.. ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ప్రధాని నరంద్రమోదీకీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్లచట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.
ఇక, ట్విటర్ లోనూ ‘మోడీ బక్వాస్ బంద్ కరో’ (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్‌ట్యాగ్ భారత్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రధాని మోడీ గారు. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనలపై మాట్లాడండి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు చెప్పే విషయాన్ని మోడీ వినరు.. కానీ ఆయన మన్ కీ బాత్ అందరూ వినాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో మోడీ మన్ కీ బాత్ వీడియోపై డిస్‌లైక్‌ల పరంపర మళ్లీ మొదలైంది. ఆ వీడియోకు వచ్చిన లైక్ ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్ లైకులు వస్తున్నాయి.
మరోవైపు, కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఇవాళ 72వ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా గొలుసు సరఫరా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఆర్థికవేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయన్నారు. అయితే ఈ కాలంలో భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు. ఈ సామర్థ్యాలనే ‘ఆత్మనిర్భర్ భారత్’గా అభివర్ణించారు.
ప్రజలు వోకల్ ఫర్ లోకల్ నినాదం అందిపుచ్చుకున్నారని, ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేసేలా పరిశ్రమలు చర్యలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఉత్తమమైనవి భారత్‌లో తయారుకావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం సంస్థలు, అంకురాలు ముందుకురావాలని అన్నారు.
ఈ సందర్భంగా విదేశీ వస్తువుల స్థానంలో దేశీయ ఉత్పత్తులను వినియోగించాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. రోజూ ఉపయోగించే వస్తువుల జాబితాను తయారుచేసుకోండి. అందులో విదేశాల నుంచి దిగుమతై మన జీవితంలో భాగమైన వాటిని గుర్తించండి. వాటికి భారతీయ ప్రత్యామ్నాయాలను వెతకండి. కష్టపడి తయారు చేసిన భారతీయుల ఉత్పత్తులను వినియోగించండి అని మోడీ సూచించారు.
భారత్‌లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మోడీ గుర్తుచేశారు. 2014-18 మధ్య చిరుతపులుల సంఖ్య 60 శాతం పెరిగి 12,852కి చేరిందని చెప్పారు. అదేవిధంగా సింహాలు, పులుల సంఖ్యలో కూడా వృద్ధి నమోదైందని అన్నారు. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడుతున్నారని తెలిపారు.