పుల్వామా ఎఫెక్ట్ : బోసిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పుల్వామా ఎఫెక్ట్ ప్రభావం భారత్-పాక్ ల మధ్య నడిచే ‘సంఝౌతా ఎక్స్‌ప్రెస్”పై కూడా పడింది. ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించే వారి సంఖ్య గడిచిన 11 రోజుల్లో రోజురోజుకు పడిపోతోంది.
పుల్వామా దాడి తర్వాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారి సంఖ్య దారుణంగా పడిపోయిందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. సోమవారం మరీ ఘోరంగా వందమంది ప్రయాణికులతో మాత్రమే రైలు ప్రయాణించినట్టు తెలిపింది. సాధారణ సమయాల్లో ఒక్కో ట్రిప్‌లో కనీసం వెయ్యిమంది వరకు ప్రయాణికులు ఉంటారని, కానీ పుల్వామా ఘటన తర్వాత ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయిందని పేర్కొన్నారు. బుధ, ఆదివారాల్లో ఈ రైలు పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రాత్రి గం.11:10 గంటలకు బయలుదేరుతుంది. శాంతి ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలులో ఆరు స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ-3 టైర్ కోచ్ ఉంటాయి. పంజాబ్‌లోని అటారీ స్టేషన్‌కు చేరుకునే సరికే ఈ రైలులోని స్లీపర్ కోచ్‌లు దాదాపు ఖాళీ అయిపోతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని రైల్వే ఉన్నతాధికారి చెప్పారు.