వాళ్లు బతికేదెట్టా! : పాక్‌కు టమోటా ఎగుమతులు నిలిపివేత

స్వలాభాలను పక్కకు పెట్టి పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాక్‌కు ఎగుమతులను ఆపేస్తున్నారు భారత రైతులు. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్‌పై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అక్కడికి ఎగుమతి చేయాల్సిన టీ(తేయాకు)ఉత్పత్తులను ఆపేశారు. ఇప్పుడు తేయాకు రైతులతో పాటు టొమాటో రైతులు కూడా చేరారు. మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలోని టమాటో రైతుల కమ్యూనిటీ దాయాది దేశం పాకిస్తాన్‌కు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేదిలేదంటూ నిర్ణయించుకున్నారు.
ఆ ప్రాంతంలో 5వేల మంది వరకూ ఇదే పంటను పండిస్తున్నారు. వారిలో ఒకరైన రవీంద్ర పటిదార్ అనే రైతు మాట్లాడుతూ.. ‘మేం రైతులం, టొమాటో పంట పండిస్తాం. ఇంతకుముందు వరకూ పాకిస్తాన్‌కు కూడా ఇదే పంటను ఎగుమతి చేసే వాళ్లం. మనం పంపింది తింటూనే మన సైనికులను చంపుతున్నారు. పాకిస్తాన్‌కు భారత్ ఎగుమతులు ఆగిపోతే మన లోటు ఏంటో తెలియాలి. దాంతో పాటు వేరే ఏ దేశం పాక్‌కు టమోటాలు పంపకూడదు. డబ్బులు రావేమోననే దిగులు లేదు. సైనికులే లేకపోతే ఆహారం ఏం చేసుకుంటాం’ అని వెల్లడించాడు.
రైతుల నిర్ణయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. ‘జాబువా జిల్లాలోని రైతులు తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నా. పాక్‌కు టమోటాలు ఎగుమతి చేయద్దని సరైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయతను చాటి చెప్పారు’ అంటూ రైతులపై ప్రశంసలు కురిపించారు.