జై జవాన్‌.. అమర జవాన్‌ : దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 01:29 AM IST
జై జవాన్‌.. అమర జవాన్‌ : దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

Updated On : February 16, 2019 / 1:29 AM IST

పుల్వామా ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలను యావత్‌ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా ప్రార్థించారు. జై జవాన్‌.. అమర జవాన్‌ నినాదాలతో దేశమంతా హోరెత్తింది. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధంచేసి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
ఇక జమ్ము నుండి ఢిల్లీ పాలెం విమానాశ్రయం చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాలకు ప్రధాని మోదీతో సహా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

మరోవైపు ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 17 తేదీల్లో అమర జవాన్ల స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలని మోదీ.. బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రులు, ఎంపీలకు స్వయంగా సూచించారు. అమరులైన వారిలో 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు కాగా.. నలుగురు పంజాబ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. 

ఇక ఈ దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు 50 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్‌, యూపీ సర్కార్‌లు 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. తమిళనాడు ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ప్రకటించగా.. త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు 21 లక్షలు, ఒడిశా, పంజాబ్‌ ప్రభుత్వాలు 12 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. అలాగే అమరుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించాయి. ఇదిలావుంటే.. ఫిబ్రవరి 16వ తేదీ శనివారం కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో నివాళులర్పించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.