రాహుల్ “క్షమాపణ” : నేడు దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు

రాఫెల్ డీల్ లో అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(నవంబర్-16,2019)బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలలో భాగంగా ఇవాళ AICC ప్రధాన కార్యాలయం బయట కూడా ఆందోళనలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా… రాఫెల్ డీల్‌లో అవినీతి జరిగిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ చౌకీదార్ కాదనీ చోర్ అనీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. అయితే గురువారం సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ చేసిన చౌకీదార్ చోర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టింది. రాఫెల్ డీల్‌లో కూడా ఎలాంటి అవినీతీ జరగలేదని ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో బీజేపీ శ్రేణులు స్వరాలు పెంచాయి. కాంగ్రెస్, రాహుల్ టార్గెట్‌గా ఆందోళనలకు పిలుపిచ్చాయి.
మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌ను డ్యామేజ్ చెయ్యడానికే కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసిందని బీజేపీ ఫైర్ అయ్యింది. ఎప్పుడైనా సాధారంణా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తాయి. కానీ ఇప్పుడు అధికారపక్షమే ఆందోళనలు చేస్తోంది. మరి రాహుల్ క్షమాపణలు చెబుతారా లేక… ఆందోళనలు ఉద్ధృతం అవుతాయా అన్నది చూడాలి.