పీఎం కేర్స్ ఫండ్ పై రాహుల్ విమర్శలు

పీఎం కేర్స్ ఫండ్ పై రాహుల్ విమర్శలు

rahul-gandhi-criticises-pm

Updated On : December 17, 2020 / 7:50 PM IST

Rahul Gandhi criticises PM Cares Fund పీఎం కేర్స్ ఫండ్ విషయమై మోడీ సర్కార్ పై మరోమారు విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పీఎం కేర్స్ ప్ర‌భుత్వ నిధా? ప్రైవేటు నిధా? అనే అంశంపై ప‌్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేద‌న్న వార్తాక‌థ‌నాల‌పై రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.న్యూస్ హెడ్‌లైన్స్‌ను స్క్రీన్ షాట్ చేసి ట్వీట్ చేస్తూ.. పీఎం కేర్స్​ పారదర్శకతకు నమస్తే అని వ్యంగ్యంగా ట్వీట్​ చేశారు. కాగా, ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మోదీకి బుధవారం పలు ప్రశ్నలు సంధించారు. మరుసటి రోజే రాహుల్ ఈ విమర్శలకు దిగటం గమనార్హం. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సైతం పీఎం కేర్స్ ఫండ్ పారదర్శకతపై వరుస ట్వీట్లలో ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.

కాగా, కోవిడ్-19 విపత్కాలం ప్రారంభంలో అత్యవసర ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మార్చి27న పీఎం కేర్స్(ప్రైమ్ మినిస్టర్స్‌ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ) ఫండ్ ని ప్రధాని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పీఎం చైర్ ‌ప‌ర్స‌న్‌గా, సీనియ‌ర్ మంత్రులు ట్ర‌స్టీలుగా ఉంటారు. ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ పీఎం కేర్స్ ట్ర‌స్ట్‌ ని రిజిస్టర్ చేసింది.

అయితే,కోవిడ్-19 సమయంలో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్.. ప్రభుత్వ సంస్థ కాదని ప్రైవేటు సంస్థని ఆర్‌టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం తెలిపింది. కార్పొరేట్ సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా విరాళాలు స్వీకరించిన ఈ సంస్థపై ప్రభుత్వానికి చెందిన ఎలాంటి అజమాయిషీ చెల్లదని ఆ సమాధానంలో పేర్కొన్నారు. ట్ర‌స్ట్‌ డీడ్‌ లోని పాయింట్ 5.3 ప్ర‌కారం..ట్రస్ట్ యొక్క పనితీరులో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఏ విధంగానైనా కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ నియంత్రణ శక్తి లేదని పేర్కొంది.

అయితే కార్పొరేట్ విరాళాలకు సంబంధించిన అనుమతి, ఇతర అంశాలను కంపెనీల చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి లేదంటే ఐదైనా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సామాజికి-ఆర్థిక అభివృద్ధి నిధులు, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సంక్షేమం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంక్షేమం, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ సంక్షేమం, మైనారిటీస్ సంక్షేమం, మహిళా సంక్షేమం లాంటి నిధులకు మాత్రమే కార్పొరేట్ విరాళాలు చెల్లించాలి. పీఎం కేర్ సైతం ప్రభుత్వ రంగ ట్రస్ట్ అనే నమ్మకంతో పెద్ద సంఖ్యలో వచ్చిన కార్పొరేట్ విరాళాలపై ఎవరూ అభ్యంతరం తెలపలేదు. అయితే పీఎంకేర్‌కు వచ్చిన నిధులపై సరైన సమాచారం లేకపోవడంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆర్టీఐ పరిధిలోకి కూడా రాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అప్పట్లో వారించాయి.