అక్కడ, పని కావాలంటే పడుకోవాల్సిందే.. యూపీలో లాక్‌డౌన్ దారుణాలు, యథేచ్చగా బాలికల లైంగిక దోపిడీ

పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంతంలోని చిత్రకూట్ లో అమ్మాయిల దయనీయ స్థితి ఇది. పేద గిరిజన కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిల శరీరాలతో వ్యాపారం జరుగుతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. రోజుకు 150 నుంచి 200 రూపాయలు వచ్చే పని కావాలంటే కోరిక తీర్చాల్సి దుస్థితి ఏర్పడింది.
పని కావాలంటే కోరిక తీర్చాల్సిందే:
చిత్రకూట్ లో చట్ట వ్యతిరేకంగా మైనింగ్ నడుస్తోంది. స్థానికంగా ఉండే గిరిజన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వారు మైనింగ్ పనులు చేయాల్సి వస్తోంది. అయితే కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు వారికి అంత సులభంగా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. పని చేయడమే కాదు కోరిక కూడా తీర్చాల్సి వస్తోంది. పడక సుఖం ఇస్తేనే ఆ రోజు చేసిన పనికి కూలి డబ్బు అందుతాయి. పేదరికం కారణంగా కడుపు నింపుకోవడానికి మరో దారి లేక ఆడపిల్లలు కాంట్రాక్టర్లు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నారు. కూలి డబ్బుల కోసం పడుకుంటున్నారు. చక్కగా చదువుకుంటూ, ఆడుకోవాల్సిన వయసులో, ఆడపిల్లలు తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈ పనికి ఒప్పుకోవాల్సి వస్తోంది. దాదాపు బాలికలంతా 12 నుంచి 14ఏళ్ల వయసు లోపు వారే. వారంతా గనుల్లో పనులకు వెళతారు. అయితే రోజుకు రూ.200 నుంచి 300 కూలి డబ్బు కావాలంటే పని చేయడంతో పాటు కాంట్రాక్టర్ల లైంగిక వాంఛలు తీర్చాల్సి ఉంటుంది.
నాలుగు మెతుకులు కావాలంటే నలిగిపోవాల్సిందే:
ఎవరైని పని కావాలని వస్తే కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు ముందుగా వారికి ఓ కండీషన్ పెడతారు. లైంగిక కోరికలు తీర్చడానికి, తమ పక్కన పడుకోవడానికి ఒప్పుకుంటేనే పని ఇస్తామని ముందే షరతు పెడతారు. దానికి అంగీకరిస్తేనే పనిలోకి రానిస్తారు. ఇలా శరీరాలు అమ్ముకోవడం అమ్మాయిలకు కానీ వారి కుటుంబాలకు కానీ అస్సలు ఇష్టం లేదు. కానీ మాకు మరో దారి లేదు, మేము నిస్సహాయులం అని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాంట్రాక్టర్లు మా శ్రమను, శరీరాలను దోచుకుంటారు, కానీ, కూలి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. ఒకవేళ వారి కోరిక తీర్చేందుకు నిరాకరిస్తే, మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తామని బెదిరిస్తారని స్థానికులు వాపోయారు. పని నుంచి తీసేస్తే ఇక తమకు తినడానికి ఏమీ ఉండదని విలపించారు. అందుకే కాంట్రాక్టర్ల షరతులకు అంగీకారం తెలుపుతున్నామని చెప్పారు. కాంట్రాక్టర్లకు ఎదురు తిరిగే కొండపై నుంచి కిందకు తోసి చంపేస్తామని బెదిరిస్తున్నారని స్థానికులు చెప్పారు.
మరో దారి లేదు:
తమ ఆడపిల్లల శీలాన్ని కాంట్రాక్టర్లు దోచుకుంటున్న సంగతి తెలిసినా తల్లిదండ్రులు కూడా మౌనంగా బాధను భరిస్తున్నారు తప్ప నోరు విప్పడం లేదు. ”మేము నిస్సహాయులం. మాకు మరో దారి లేదు. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బు ఇస్తామని చెబుతారు. కానీ వారు ఇచ్చేది రూ.150 నుంచి రెండు వందలే. పిల్లలు ఇంటికి తిరిగి వచ్చాక, వారు ఎదుర్కొన్న అమానుషాలను మాతో చెబుతారు. కానీ మేము ఏం చేయగలం. మేము కేవలం కూలీలం మాత్రమే. మా కుటుంబాలను పోషించుకోవాలి. నా భర్త అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అతడికి చికిత్స అందించాలి” అని స్థానిక మహిళ కంటతడి పెడుతూ చెప్పింది.
ఆ సమయంలో చాలా భయంగా, నొప్పిగా ఉంటుంది:
”పని చేసే చోట కాంట్రాక్టర్లు బెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని అక్కడికి తీసుకెళతారు. ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తారు. వారి కోరికలు తీర్చుకుంటారు. ఆ సమయంలో చాలా భయంగా, నొప్పిగా ఉంటుంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. నొప్పిని, బాధను భరించడం తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ మేము ఎదిరిస్తే బాగా కొడతారు. చంపేస్తామని బెదిరిస్తారు. నొప్పిన భరించడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇదంతా మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని లేదా చచ్చిపోవాలని అనిపిస్తుంది” అని ఓ బాలిక తాను ఎదుర్కొంటున్న నరకయాతను వివరిస్తూ బోరున విలపించింది. ఓవైపు పేదరికం, మరోవైపు లాక్ డౌన్.. గిరిజనుల కుటుంబాలను మరింత దయనీయంగా మార్చేశాయి.
మేకప్ చేసుకుని పనికి పోవాలి:
”మేము ముఖానికి మేకప్ చేసుకోకుండా, చేతులకు గాజులు వేసుకోకుండా పనికి వెళితే కాంట్రాక్టర్లు కోపగిస్తారు. మేమిచ్చే కూలి డబ్బులు ఏం చేస్తున్నావని, ఎక్కడ ఖర్చు పెడుతున్నావని నిలదీస్తారు. అసలు వారిచ్చే 100 రూపాయలు దేనికి సరిపోతాయని” ఓ బాలిక వాపోయింది. మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ఎక్కడా పనులు దొరకడం లేదు. కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. పని కోసం ఊరంతా తిరుగున్నాం. కానీ ఎక్కడా పని లేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో తమ పిల్లలను గనుల్లో పనులకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు వాపోయారు.
శాపంగా మారిన పేదరికం, శ్రమతో పాటు లైంగిక దోపిడీ:
చిత్రకూట్ లోని కొండల్లో సుమారు 50వరకు స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. కడుపు నింపుకోవడానికి మరో మార్గం లేకపోవడంతో స్థానికంగా ఉండే కోల్ తెగ కుటుంబాలు తమ పిల్లలను గనుల్లో పనులకు పంపిస్తున్నారు. పేదల నిస్సహాయతను కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు సొమ్ము చేసుకుంటున్నారు. వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. అలాగే వారి పిల్లల శరీరాలను చిద్రం చేస్తూ లైంగికంగా దోచుకుంటున్నారు. కాగా, ఎక్కడో దూరంగా ఉండే ఈ కొండల దగ్గరికి ఏ ప్రభుత్వ అధికారి రాడు, ఏ చట్టమూ ఇక్కడ పని చెయ్యదు. అయితే జాతీయ మీడియాలో కాంట్రాక్టర్ల దురాఘతాలపై వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. దీనిపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. తమకు ఫిర్యాదు అందితే ఆ కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి:
దీనిపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం స్పందించింది. దీనిపై విచారణ జరిపేందుకు ఓ టీమ్ ని పంపుతామని కమిషన్ తెలిపింది. పోలీసులు మాత్రం, గ్రామంలో ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతున్నట్టు తమ దృష్టికి రాలేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, గిరిజన కుటుంబాల కష్టాలు తీర్చాలని, వారి పిల్లలపై జరుగుతున్న లైంగిక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, సదరు కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించడమో లేదా ఆదాయం వచ్చేలా చేయడమో, లేక వారి ఆకలి కేకలు తీర్చడమో.. తక్షణమే ఈ పనులను ప్రభుత్వం చేస్తే, ఇకనైనా ఆడపిల్లల లైంగిక దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నారు.
Read Here>>భువనేశ్వర్ టెక్ మహింద్రా ఉద్యోగులకు కరోనా..