చర్చలకు కేంద్రం సిద్ధం…రైతుల గురించి ఆందోళన చెందుతున్నామన్న వ్యవసాయ మంత్రి

Union Agriculture Minister Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగానే ఉన్నట్లు తోమర్ తెలిపారు.
నూతన అగ్రి చట్టాలతో కనీస మద్దతు ధర(MSP),ఏపీఎంసీపై ఎలాంటి ప్రభావం పడదని చర్చల సందర్భంగా రైతులకు స్పష్టం చేసినట్లు తోమర్ తెలిపారు. కానీ రైతులు భయపడుతున్నారని, చట్టాలను రద్దు చేయాలన్న దగ్గరే వారు ఆగిపోయారన్నారు. రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తెచ్చిందని గుర్తు చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకున్నామని తెలిపారు. నూతన సాగు చట్టాలతో రైతులు తమ పంటను ఎక్కడైనా, ఎవరికైనా.. తమకు నచ్చిన ధరకు విక్రయించే అవకాశం ఉంటుందన్నారు.
రైతులు తమ భూమి పారిశ్రామికవేత్తల వశమయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారని, కానీ ఇది జరగదని అన్నారు. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, పంజాబ్, గుజరాత్లో ఎప్పటినుంచో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కొనసాగుతోందని, అక్కడ ఇప్పటివరకు అలాంటి సమస్యలేవీ రాలేదని తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు.
సాగు చట్టాల్లో అభ్యంతరాలపై రైతులు సలహాలు ఇస్తారని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలపై చర్చించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చలికాలం,కరోనా పరిస్థితుల్లో ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తోమర్ తెలిపారు. రైతులు తక్షణమే ఆందోళనలు విరమించి..కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. ఢిల్లీ-హర్యాణా సరిహద్దులోని టిక్రీ, సింఘూ ప్రాంతాల వద్ద అన్నదాతల నిరసన కొనసాగుతోంది. ఢిల్లీలోని బురారీ మైదానంలో పంజాబ్, హర్యాణా రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు అర్ధనగ్నంగా తమ నిరసన తెలియజేశారు. చలిలో నిరసనపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. వారిలా బదులిచ్చారు.
నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు తేల్చి చెబుతున్నారు. అగ్రి చట్టాలను రద్దు చేయకుంటే రైల్వే ట్రాక్‌లను దిగ్బంధిస్తామని ఆల్టిమేటం జారీ చేసినట్లు రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. భారత ప్రజలంతా రైల్వే ట్రాక్‌ల వద్దకు చేరుకోవాలని ఇవాళ సమావేశంలో నిర్ణయించినట్లు రైతు సంఘాల ప్రతినిధి బూటా సింగ్ తెలిపారు. సంయుక్త్ కిసాన్ మంచ్ త్వరలోనే దీనిపై తేదీ ఖరారు చేస్తుందన్నారు.
కాగా, కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతుల వెనుక చైనా, పాక్ కుట్ర ఉందంటూ కేంద్రమంత్రి రావుసాహెబ్ దాన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజన్స్ తీసుకువచ్చిన సమయంలో ముస్లింలను తప్పుదోవ పట్టించినట్లు ఆయన వెల్లడించారు. అయితే సీఏఏ, ఎన్ఆర్‌సీ అంశంలో వాళ్లు విఫలం అయ్యారని, అలాగే కొత్త చట్టాల వల్ల నష్టం జరుగుతుందని రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన విమర్శించారు.